శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా రూ. 429 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపింది భారతీయ రైల్వే. దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా వలస కార్మికులను తమ స్వస్థాలకు చేర్చడంలో భాగంగా సుమారు 4 వేలకు పైగా ప్రత్యేక రైళ్లను నడిపినట్లు తెలిపింది. ఇందుకోసం రూ. 2,142 కోట్లు వెచ్చించినట్లు పేర్కొంది.
ఈ వివరాలన్నింటినీ అజయ్ బోస్ అనే ఓ సామాజిక కార్యకర్త.. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)-2005 కింద కోరగా గణాంకాలను వెల్లడించింది రైల్వే శాఖ. జూన్ 29 నాటికి దేశవ్యాప్తంగా 4,615 శ్రామిక్ రైళ్లను నడిపినట్లు స్పష్టం చేసింది.
గుజరాత్ నుంచే అధికం..
రైల్వే శాఖ పొందిన సొమ్ములో.. ఒక్క గుజరాత్ నుంచే రూ.102 కోట్లు వచ్చాయి. సుమారు 15 లక్షల మంది వలస కూలీలను తమ రాష్ట్రానికి చేర్చేందుకు.. 1,027 శ్రామిక్ రైళ్ల కోసం ఆ రాష్ట్ర సర్కార్ భారీ మొత్తాన్ని వెచ్చించింది. మహారాష్ట్ర రూ.85 కోట్లు వెచ్చించి.. 844 రైల్వే సర్వీసుల ద్వారా 12 లక్షల మంది కార్మికులను తమ రాష్ట్రానికి వచ్చే ఏర్పాట్లు చేసింది. ఈ విషయంలో మూడో స్థానంలో ఉన్న తమిళనాడు.. 4 లక్షల మంది కార్మికుల కోసం(271 రైళ్లు) రూ.34 కోట్లు ఖర్చుచేసింది. ఉత్తర్ప్రదేశ్, బిహార్, బంగాల్ రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఒక్కో ప్రయాణికుడి కోసం రూ. 3,400
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న కూలీలను స్వస్థలాలకు చేర్చేందుకు.. ఒక్కో ప్రయాణికుడిపై రూ.3,400 ఖర్చు చేసినట్లు రైల్వేశాఖ స్పష్టం చేసింది. అలా 63 లక్షల మంది కార్మికులను వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు పేర్కొంది. రవాణా ఖర్చుల్లో రాష్ట్రాలు 15 శాతం ఖర్చు చేయగా.. మిగతా 85 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం భరించినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.
ఇదీ చదవండి:'రద్దీని నియంత్రించేందుకు రైల్వేశాఖ చర్యలు'