లాక్డౌన్ వేళ భారత రైల్వే నడిపిన 1074 'శ్రామిక్' రైళ్లలో... ఇప్పటివరకు దాదాపు 14 లక్షల మంది సొంతూళ్లకు చేరుకున్నారని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. వలసదారులను ఇంటికి చేర్చేందుకు రాష్ట్రాల నుంచి 15 రోజుల్లో వెయ్యికి పైగా ఆమోదాలు వచ్చాయని రైల్వే శాఖ తెలిపింది. ఈ వలస కూలీల్లో ఎక్కువమంది ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు.
రోజుకు 300 రైళ్లు..
వలసదారుల కోసం ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో రైల్వే అందించిన సేవలను ప్రశంసించారు గోయల్. కేవలం ఈ రెండు రాష్ట్రాలకే 80శాతం కార్మికులు చేరినట్టు తెలిపారు.
గడిచిన మూడు రోజుల్లో.. సుమారు రెండు లక్షలకుపైగా వలస కార్మికులను రవాణా చేసినట్లు పీయుష్ గోయల్ వెల్లడించారు. ఇకపై రోజుకు మూడు లక్షలకుపైగా కార్మికులను స్వగ్రామాలకు చేర్చేందుకు యోచిస్తున్నట్టు వివరించారు.
రోజుకు 300 రైళ్లు నడిపే సామర్థ్యం రైల్వేకు ఉందన్నారు గోయల్. ఇకపై ప్రయాణికుల సౌకర్యార్థం మూడు స్టేషన్లలో రైళ్లు ఆగనున్నట్టు తెలిపారు.