దేశ వ్యాప్తంగా లాక్డౌన్తో షాపులు నడవక.. జనం బయటకు రాక నిరుపేదలు, వలసకార్మికులు, నిరాశ్రయులకు ఆహారం కరవైంది. ఈ నేపథ్యంలో అవసరంలో ఉన్న వారి ఆకలి తీర్చింది రైల్వే శాఖ. ఇప్పటి వరకు 30 లక్షల ఆహార ప్యాకెట్లను ఆయా ప్రాంతాల్లోని పేదలకు అందించింది. ఏప్రిల్ 20 వరకు 20 లక్షల ప్యాకెట్లను అందించగా.. కేవలం 10 రోజుల్లోనే 10 లక్షల ప్యాకెట్లను పంచింది. ఈ మేరకు రైల్వే శాఖ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి.
"కరోనా వైరస్ వల్ల అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా రోజువారీ కూలీలు, వలస కార్మికులు, నిరుపేదలు, నిరాశ్రయులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. దీంతో ఆర్పీఎఫ్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఐఆర్సీటీసీ వంటశాలల్లో వండిన ఆహారాన్ని.. ప్యాకెట్లలో సిద్ధం చేసి నిరుపేదలకు అందించాం. ఆహారం పంపిణీ చేసేటప్పుడు భౌతిక దూరం, పరిశుభ్రతను పాటించాం."