కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమాల్లో మరింత యాక్టివ్ కానున్నారు. ఆయన ఆలోచనలు, ప్రస్తుత పరిస్థితులు, చరిత్రకు సంబంధించిన విషయాలను వీడియో రూపంలో ప్రజలకు వివరించనున్నారు. టీవీలు, ఫోన్లలో విద్వేషపూరిత ప్రసంగాలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అసత్య కథనాలు భారత్‌ను విడదీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్.
"మన దేశంలో తాజాగా నెలకొన్న పరిణామాలు, చరిత్ర, కరోనా సంక్షోభంపై మన దృక్పథాన్ని మార్చివేసే లక్ష్యంతో పలు వీడియోలు షేర్ చేస్తాను. మంగళవారం నాటి నుంచే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నాం. ప్రస్తుతం భారత మీడియా నియంతృత్వానికి కట్టబడి పని చేస్తోంది. టీవీల్లో విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. వాట్సాప్‌ల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఈ విధమైన అబద్ధపు ప్రకటనలు దేశాన్ని రెండుగా చీలుస్తాయి."