పేదల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తానని హామీ ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... కేవలం ధనికులకే ఆ మేలు చేశారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ధనికులకు ప్రధాని కాపలాదారుడిగా మారారని విమర్శించారు.
అసోంలోని బొకాఖత్లో ఎన్నికల ప్రచారం చేశారు రాహుల్. వ్యాపారులు దోచుకున్న డబ్బును సేకరించి కనీస ఆదాయ పథకం ద్వారా పేదలకు అందిస్తామని స్పష్టం చేశారు.
అసోంలోని బొకాఖత్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
" వచ్చే ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్న 20 శాతం పేదలకు 3 లక్షల 70 వేల రూపాయలు కచ్చితంగా వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తుంది. నిధులు ఎక్కడి నుంచి వస్తాయని మోదీ ప్రశ్నిస్తున్నారు. చౌకీదార్కు నేను జవాబు చెప్తాను. ఆ ధనం అనిల్ అంబానీ లాంటి వారి జేబుల్లోంచి వస్తుంది. వాయుసేనకు చెందిన 30 వేల కోట్ల రూపాయలను మీరు(మోదీ) అంబానీకి ఇచ్చారు. వాయుసేన నుంచి డబ్బు దొంగిలించి ఆ దొంగ జేబులో వేశారు. అదే ధనాన్ని ఆ దొంగ నుంచే సేకరించి దేశంలోని పేదలకు అందిస్తాం."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు.
ప్రస్తుతం నిరుద్యోగ సమస్యతో యువత సతమతమవుతోందని... కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే తమ సొంత వ్యాపారం పెట్టుకునేందుకు సహాయం అందిస్తామని రాహుల్ అన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా పునరుద్ధరిస్తామని, పౌరసత్వ చట్ట సవరణ బిల్లును అడ్డుకుంటామని హామీ ఇచ్చారు రాహుల్.