రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది భాజపా. ఒక్కో జిల్లా నుంచి ఒక్కో ఉత్పత్తిని ప్రోత్సహించాలనే ఆలోచన తనదే అని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మండిపడింది. తాము గతంలో సిఫార్సు చేసిన విధానాన్ని రాహుల్ కాపీ చేసి చెప్పారని విమర్శించింది.
భాజపా పాలిత హిమాచల్ ప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఒక్కో జిల్లా నుంచి ఒక్కో ఉత్పత్తిని ఎంపిక చేసుకోవాలని పరిశ్రమల శాఖ సర్వే తెలిపింది. ఇందుకు సంబంధించిన కథనాన్ని ట్విట్టర్లో ట్యాగ్ చేశారు రాహుల్. ఇది మంచి ఆలోచన అని, ఈ విధానాన్ని అమలు చేయాలని కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వానికి తాను సూచించానని ట్వీట్ చేశారు.
రాహుల్ వ్యాఖ్యలపై గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్పందించారు. ఒక్కో గ్రామం నుంచి ఒక్కో ఉత్పత్తిని ప్రోత్సహించాలని 2016లోనే అప్పటి ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. గుజరాత్ ప్రభుత్వం ఆలోచనలను రాహుల్ తన ఆలోచనగా చెప్పుకుంటున్నారని, రాహుల్ తెలివితేటలను ఇది రుజువు చేయదని విమర్శించారు.
ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా రాహుల్‌పై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒక్కో జిల్లాకు ఒక్కో ఉత్పత్తి విధానాన్ని 2017 యూపీ ఎన్నికల మేనిఫెస్టోలోనే భాజపా పొందుపరిచిందని వివరించారు. దానిని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. చిన్న పిల్లాడిలా ప్రవర్తించడం రాహుల్ ఎప్పుడు మానుకుంటారో అని సెటైర్లు విసిరారు.
ఇదీ చూడండి: క్లినికల్ ట్రయల్స్‌లో వేగం పెంచిన 'సీరం'