కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్యను వీలైనంత తొందర్లో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ అన్నారు. పార్టీకి దారీ తెన్నూ లేకుండా ఉందన్న భావన ప్రజల్లో పెరుగుతోందని, కాబట్టి వీలైనంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. అధ్యక్ష బాధ్యతల విషయమై ఓ సారి రాహుల్ గాంధీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలని శశి థరూర్ అన్నారు. ఒకవేళ తన మునుపటి వైఖరిని మార్చుకోకుంటే పార్టీకి క్రియాశీల, పూర్తిస్థాయి ప్రత్యామ్నాయ నాయకుడిని అన్వేషించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్లూసీ)కి సూచించారు.
'అధ్యక్ష బాధ్యతలపై రాహుల్ అభిప్రాయం తెలుసుకోవాలి' - congress president latest news
కాంగ్రెస్కు దారీ తెన్నూ లేకుండా ఉందన్న భావన ప్రజల్లో ఇంకా పెరగకముందే వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్. అధ్యక్ష బాధ్యతల విషయంపై రాహల్ గాంధీ అభిప్రాయం తెలుసుకోవాలని సూచించారు.
భాజపా విభజన రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయమని థరూర్ అన్నారు. అయితే, పార్టీ మునిగిపోతున్న నావ అనే భావన ప్రజల్లో పెరుగుతోందని, అందుకు ఇటీవలి దిల్లీ ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు. దీంతో ఓటర్లు ఆప్ వంటి ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని ఉదహరించారు. ఈ భావనను ప్రజల్లో తొలగించి, పార్టీ పునర్ వైభవం సాధించాలంటే నాయకత్వ ఎన్నిక తప్పనిసరి అని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ప్రియాంక పేరు గురించి ప్రస్తావించగా.. ఎన్నికల ప్రక్రియ మొదలవ్వగానే ఆమె నుంచి ఒక అప్లికేషన్ వస్తుందని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమెకు సహజంగానే ఆ ఛరిష్మా, సంస్థాగత అనుభవం ఉందని పేర్కొన్నారు. అయితే, అది ఆమె వ్యక్తిగతమని, ఆమె నిర్ణయం ఏదైనా గౌరవించాల్సిన అవసరం ఉందని థరూర్ అభిప్రాయపడ్డారు.