కేరళలో నర్సు రాజమ్మను కలిసిన రాహుల్ రాహుల్ గాంధీని కలవటం కేరళకు చెందిన 72 ఏళ్ల విశ్రాంత నర్సు రాజమ్మ వావతిల్కు ఓ ప్రత్యేక క్షణం. 49 ఏళ్ల క్రితం దిల్లీ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన రాహుల్‌ను తన చేతులతో ఎత్తుకున్నారు వావతిల్. శిశువుగా ఉన్నప్పుడు తాను ఎత్తుకున్న వ్యక్తి తమ నియోజకవర్గ పార్లమెంటు సభ్యునిగా ఎదిగి రావటంపై సంతోషం వ్యక్తం చేశారు.
కోజికోడ్‌లోని అతిథి గృహానికి రాజమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులు వచ్చారు. బిజీ బిజీగా ఉన్న సమయంలోనూ.. తనను కలిసేందుకు వచ్చిన రాజమ్మను కలిసి హత్తుకున్నారు రాహుల్. దగ్గరకు తీసుకుని ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులను అభినందించారు.
" రాహుల్‌ను కలిసినందుకు నేను ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నాను. రాహుల్ పుట్టినప్పుడు ఎత్తుకున్న మొదటి వ్యక్తిని నేనే. ఆయనను కలిసిన సందర్భంలో అప్పటి జ్ఞాపకాలు నా మనసులో మెదిలాయి."
-రాజమ్మ వావతిల్, విశ్రాంత నర్సు.
మురిసిన రాహుల్...
రాహుల్ గాంధీతో తన జ్ఞాపకాలను పంచుకున్నారు రాజమ్మ. అప్పుడే పుట్టిన శిశువుని చేతిలోకి తీసుకుని లాలించిన విషయాన్ని పంచుకున్నారు. ఆమె మాట్లాడుతున్నంత సేపు చిరునవ్వుతో వింటూ ఉండిపోయారు రాహుల్.
ప్రేమతో స్వీట్లు...
రాహుల్‌కు తాను పనసపండుతో స్వయంగా తయారు చేసిన చిప్స్, స్వీట్లు అందించారు రాజమ్మ. మళ్లీ తనను తప్పకుండా కలుస్తానని మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు రాహుల్.
ఇదీ చూడండి:చిన్నారి మాటకు మురిసిన రాహుల్ గాంధీ