ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్ ప్రస్తుతం భారత్‌లో చాలా వేగంగా వ్యాపిస్తోంది. ప్రాణాంతక వైరస్‌తో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్న తరుణంలో కోవిడ్-19 అదుపులోనే ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ ప్రకటనపై వ్యంగాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ.
ప్రజలు తీవ్ర భయాలకు లోనవుతుంటే.. ప్రభుత్వం కలవరపడాల్సిన అవసరం లేదని చెప్పడం.. టైటానిక్ పడవ మునిగిపోదని ప్రయాణికులకు కెప్టెన్ ధైర్యం చెప్పినట్టు ఉందని ఎద్దేవా చేశారు.
" భారత్‌లో కరోనా వ్యాప్తి అదుపులో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇది టైటానిక్ పడవలోని ప్రయాణికులు మునిగిపోరని పడవ కెప్టెన్ చెప్పడం లాంటిది. ప్రజల్ని ఈ విపత్తు నుంచి రక్షించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి."