దేశ రక్షణలో, పాకిస్థాన్ దుశ్చర్యలను తిప్పికొట్టడంలో భద్రత దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలపై ప్రశంసలు కురిపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. పండుగ సమయంలోనూ కుటుంబానికి దూరంగా ఉంటూ దేశాన్ని రక్షిస్తున్నారని పేర్కొన్నారు.
జమ్ముకశ్మీర్‌లోని గురేజ్ నుంచి ఉరీ సెక్టార్ వరకు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ శుక్రవారం కాల్పులకు పాల్పడగా.. దాయాదికి భద్రత దళాలు దీటుగా జవాబు ఇచ్చాయి. ఈ క్రమంలో ట్వీట్ చేశారు రాహుల్.
"పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడినప్పుడల్లా, దాని భయాలు, బలహీనతలు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రస్తుత పండుగ సమయంలోనూ కుటుంబాలకు దూరంగా ఉండి భారత సైనికులు మన దేశాన్ని కాపాడుతున్నారు. అలాగే పాకిస్థాన్ కపట ప్రణాళికలను తిప్పికొడుతున్నారు. ఆర్మీలోని ప్రతి సైనికుడికి నా వందనం. "