కొవిడ్-19ను ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వానికి అండగా ఉంటామన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ. అయితే వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో.. ఇబ్బందిపడుతున్న వలస కార్మికులను ఆదుకునేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు.
"ఈ 21 రోజుల లాక్డౌన్.. దేశ ప్రజలు, సమాజం, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే మన దేశంలో రోజువారీ కూలీలు జీవనోపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా కుదేలైంది. లాక్డౌన్ నేపథ్యంలో పట్టణాల్లో చిన్న ఉద్యోగాలు చేసుకునే కోట్లాదిమంది గ్రామాల బాట పట్టారు. ఇలా గ్రామాలకు చేరుకునేవారితో కరోనా వ్యాపించకుండా తగిన చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా వృద్ధులు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉంది. కనుక వృద్ధులను కాపాడుతూనే... యువతను అప్రమత్తంగా ఉంచాలి.