పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక ఆందోళనలకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇవాళ అసోంలో పర్యటించనున్నారు. నిరసనకారులకు పార్టీ తరఫున రాహుల్ గాంధీ.. సంఘీభావం తెలపనున్నట్లు అసోం కాంగ్రెస్ ఇన్‌ఛార్జి హరీశ్ రావత్ చెప్పారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గువాహటిలో కాంగ్రెస్ తలపెట్టిన భారీ ర్యాలీలో పాల్గొననున్న రాహుల్.. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
అసోంలో పౌర అల్లర్లలో మరణించిన ఐదుగురు నిరసనకారులకు కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళి అర్పించనున్నారు. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన మరో ఇద్దరు బాధితుల కుటుంబ సభ్యులను రాహుల్ పరామర్శించనున్నారు.