కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణ చట్టాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలకు ప్రణాళిక చేస్తోంది కాంగ్రెస్. అందులో భాగంగానే పంజాబ్ నుంచి 'ఖేతీ బచావో (వ్యవసాయాన్ని రక్షించండి) యాత్ర'ను ఆదివారం ప్రారంభించనున్నారు కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ. పంజాబ్ నుంచి దిల్లీ వరకు 3 రోజుల పాటు సాగే ఈ యాత్రలో ట్రాక్టర్లతో ర్యాలీలు, రోడ్ షోలు సహా పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
యాత్ర ప్రారంభం సందర్భంగా మోగా జిల్లాలోని బధ్నికలాన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు రాహుల్ గాంధీ. అనంతరం పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సహా ఇతర రాష్ట్ర సీనియర్ నేతలతో కలిసి యాత్రను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బధ్నికలాన్ నుంచి జత్పురా వరకు ట్రాక్టర్ ర్యాలీకి నేతృత్వం వహిస్తారు. జత్పురాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించి.. యాత్ర తొలి రోజును ముగిస్తారు.