ఆరోగ్య సేతు యాప్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. అధునాతన నిఘా వ్యవస్థను ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టడాన్ని తప్పుబట్టారు. ప్రజల సమాచార భద్రత, గోప్యతపై తీవ్ర ఆందోళన నెలకొందని ఆరోపించారు.
"ఆరోగ్య సేతు యాప్.. అధునాతన నిఘా వ్యవస్థ. దీనిని ఎలాంటి సంస్థాగత పర్యవేక్షణ లేకుండా ఓ ప్రైవేటు సంస్థ చేతిలో పెట్టారు. సమాచార భద్రత, గోప్యతపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మనల్ని ప్రమాదం నుంచి సాంకేతికత రక్షిస్తుంది. కానీ అనుమతి లేకుండా వారి వివరాలను సేకరించటం భయాన్ని కలిగిస్తుంది."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం ఆరోగ్య సేతు యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ వినియోగదారులకు.. చుట్టుపక్కల కరోనా వైరస్ వ్యాప్తి గురించి సమాచారం ఇస్తుంది. వారు క్షేమంగానే ఉన్నారా అనే విషయాలతో పాటు ముఖ్యమైన సమాచారాన్ని ఇస్తుంది.
ఈ యాప్‌ను ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా వాడాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు ఉద్యోగులు కూడా వాడేలా చూడాలని ఆయా సంస్థలకు సూచించింది.