కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి సీనియర్ నేతలు రాసిన లేఖ వర్కింగ్ కమిటీ సమావేశంలో తీవ్ర చర్చకు దారితీసింది. సీడబ్ల్యూసీ భేటీలో పార్టీ పరిస్థితిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని రాసిన లేఖ బయటకు రావటం పెద్ద దుమారం లేపింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ... సోనియా ఆసుపత్రిలో ఉన్న సమయంలో లేఖ రాయటం ఏంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లేఖ రాయటం వెనుక నేతల ఉద్దేశాలపై రాహుల్ వ్యాఖ్యానించినట్లు వార్తలు రావటం కాంగ్రెస్లో అంతర్గత దుమారానికి దారితీసింది.
"సోనియా గాంధీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు సమయం, సందర్భం లేకుండా లేఖలు ఎలా రాస్తారు? రాజస్థాన్ సంక్షోభ సమయంలో నాయకత్వంపై విమర్శలు చేస్తూ లేఖలు భావ్యమా? ఇది భాజపాకు అనుకూలంగా మారే అవకాశం లేదా? అసలు పార్టీ అంతర్గత వ్యవహారాలు బయటకు ఎలా వెళ్తున్నాయి? బహిరంగంగా ఎందుకు చర్చిస్తున్నారు?" అని సీడబ్ల్యూసీ భేటీలో రాహుల్ ప్రశ్నించినట్లు సమాచారం.
"ఈ క్రమంలోనే సీనియర్లు లేఖ రాయటం వెనుక ఉద్దేశాలపై తీవ్రంగా ప్రశ్నించారు. భాజపాతో కుమ్మక్కై ఈ పనికి పాల్పడ్డారా? అని నిలదీశారు. ఆ లేఖ తన తల్లిని తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాజీనామా చేశాక అధ్యక్ష బాధ్యతపై సోనియా విముఖత వ్యక్తం చేశారని గుర్తుచేశారు. సీడబ్ల్యూసీ సభ్యుల ప్రోద్బలంతో ఆమె అధ్యక్ష బాధ్యతలు చేపట్టారన్నారు."
- పార్టీ వర్గాలు
దురదృష్టకరం..
సీనియర్ నేతలు రాసిన లేఖలపై మన్మోహన్ సింగ్, కేసీ వేణుగోపాల్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అలా లేఖ రాయడం దురదృష్టకరమని మన్మోహన్ పేర్కొన్నట్టు తెలుస్తోంది. పార్టీ అధిష్ఠానం బలహీనపడితే పార్టీ కూడా బలహీనపడుతుందని వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ఆజాద్ స్పందన..
రాహుల్ ఆరోపణలపై స్పందించిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.. సీడబ్ల్యూసీలో అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ రాజ్యాంగానికి లోబడే లేఖ రాశామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ క్రమశిక్షణ నిబంధనలను ఉల్లంఘించినట్లు భావిస్తే తమపై చర్యలు తీసుకోవచ్చని చెప్పినట్లు సమాచారం. అంతకుముందు తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమని ఆజాద్ ప్రకటించినట్లు పార్టీ వర్గాల సమాచారం.
'కుమ్మక్కు'పై దుమారం
'భాజపాతో కుమ్మక్కు' అంటూ రాహుల్ వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన వార్తలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు కపిల్ సిబల్.