తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పనితీరుపై మాట్లాడలేకనే గతం మాట్లాడుతున్నారు' - ఎన్నికలు

ప్రభుత్వ పనితీరుపై మాట్లాడటం వల్లకాకనే ప్రధాని నరేంద్ర మోదీ గతం తవ్వుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. మధ్య ప్రదేశ్​ బినాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారాయన. మోదీని సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు రాహుల్.

భాజపాను సాగనంపాలి

By

Published : May 9, 2019, 11:48 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ పనితీరుపై మాట్లాడలేకనే గతం గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. మధ్యప్రదేశ్​ బినాలో లోక్​సభ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు రాహుల్. అధికార భాజపా సర్కారుకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు.

లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీ కుటుంబంపై మోదీ వరుసగా చేస్తున్న విమర్శల నేపథ్యంలో.. రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

"మోదీ తను ఇచ్చిన ఉద్యోగ కల్పన, రైతులకు మద్దతు, బ్యాంకు ఖాతాల్లో రూ.15లక్షలు జమ, అచ్చే దిన్ వంటి హామీలపైన మాట్లాడలేరు. ఆయన గతం మాత్రమే మాట్లాడగలరు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు

మోదీ రఫేల్ ఒప్పందంలో అనిల్ అంబానీకి 30వేల కోట్లు ఆయాచిత లబ్ధి చేకూర్చారని, అదో పెద్ద కుంభకోణం అని మరోసారి ఆరోపించారు రాహుల్. తానొక్కడే మొత్తం దేశాన్ని నడిపించగలనని మోదీ భావిస్తున్నారని, నడిపించేది ప్రజలని పేర్కొన్నారు రాహుల్.

"మోదీ.. మిమ్మల్ని దేశం ఐదేళ్లకు ప్రధానిగా ఎన్నుకుంది. గతంలో ఎవరేం చేశారని మీ నుంచి తెలుసుకోవాలని ఎవ్వరూ అనుకోవట్లేదు. మీరేం చేశారో.. ఇంకా ఏం చేస్తారో తెలుసుకోవాలని మాత్రమే భారత్ చూస్తోంది."
-రాహుల్, కాంగ్రెస్ అధ్యక్షుడు

కాంగ్రెస్ న్యాయ్ పథకం ద్వారా అనేక మందికి లబ్ధి చేకూరనుందని మరోసారి ఉద్ఘాటించారు రాహుల్. కాంగ్రెస్ వస్తే ఏడాదులోపు 22లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details