కాంగ్రెస్ రాజకీయాల్లో రాహుల్ గాంధీ మళ్లీ కీలకంగా మారారు. ఇటీవల పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై దృష్టిసారించారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాల్లో ముందుంటున్నారు.
బంగాల్ కాంగ్రెస్ నేతలతో ఇదివరకే వర్చువల్గా భేటీ అయిన రాహుల్.. తమిళనాడు, అసోం నేతలతో సోమవారం సమావేశాలు ఏర్పాటు చేశారు. బంగాల్ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులతో సమావేశంలో.. వారి నుంచి సలహాలు, సూచనలు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సన్నద్ధతపై ఆరా తీశారు. కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
పార్టీలో కీలక వ్యూహకర్త అహ్మద్ పటేల్ మరణించిన నేపథ్యంలో రాహుల్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సొంతంగా ఎలాంటి వ్యూహరచన చేస్తారా అని పార్టీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. బంగాల్లో పొత్తు అంశంపై అధిష్ఠానమే నిర్ణయం తీసుకోవాలని ఆ రాష్ట్ర వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో వీటిపై ఎలా ముందుకెళ్తారనే అంశంపై అందరి దృష్టి పడింది.