దేశంలో కొవిడ్-19 మహమ్మారి 33 లక్షల మందికి పైగా వ్యాప్తించినా.. ప్రభుత్వం ఇప్పటికీ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురాలేకపోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే సమగ్ర వ్యాక్సిన్ విధానాన్ని రూపొందించి, అనుసరించాల్సి ఉండగా... ఆ దిశగా చర్యలు కనుచూపు మేరలో కనపడటం లేదని విమర్శించారు.
కరోనా వ్యాక్సిన్‌పై ముందుచూపు లేదు: రాహుల్ - కేంద్రంపై మరోసారి ధ్వజమెత్తిన రాహుల్
దేశంలో తాజాగా నమోదైన కరోనా కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 33 లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురాలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ విషయంపై ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించటం లేదని ధ్వజమెత్తారు.
"కొవిడ్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ పాటికే సక్రమమైన, అందరినీ కలుపుకునే విధంగా వ్యూహాన్ని అనుసరించి ఉండాలి. కానీ, ఇప్పటికీ ఆ సూచనలు లేవు. భారత ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవడం ఆందోళనకరం" అని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా ధ్వజమెత్తారు. భారత్ కొవిడ్ వ్యాక్సిన్‌ను ఉత్తత్తి చేసే సామర్థ్యమున్న దేశమని రాహుల్ గతంలో ప్రకటించారు. కాగా, వ్యాక్సిన్‌ను అందుబాటు తెచ్చేందుకు, సక్రమంగా పంపిణీ చేసేందుకు.. స్పష్టమైన, సమదృష్టిగల వ్యూహాన్ని రూపొందించి, అనుసరించాలన్నారు. మీడియాలో ప్రకటనలు పేదలకు మేలు చేయవని ఆయన విమర్శించారు.
అయితే, భారత్ కొవిడ్ రేసులో ముందుందని.. 2020 చివరిలోగా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఇటీవల ప్రకటించారు. అంతేకాకుండా, మూడు కొవిడ్-19 వ్యాక్సిన్లు సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మంగళవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాహుల్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.