హాథ్రస్లో దళిత యువతి మృతికి దారితీసిన సామూహిక అత్యాచార ఉదంతాన్ని విషాదకరమైన ఘటనగా ప్రకటించి.. ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన సభ్యతను చాటుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హితవు పలికారు. దారుణమైన ఘటనలో కుమార్తెను కోల్పోయిన నిరుపేద దళిత కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. జరిగిన ఘోరంపై ప్రధాని మోదీ ఒక్కమాట కూడా మాట్లాడకపోవటాన్ని రాహుల్ ప్రశ్నించారు. పంజాబ్‌లో మంగళవారం.. రైతుల నిరసన కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. హాథ్రస్ వెళ్తున్న తనను పోలీసులు నెట్టివెయటంపైనా రాహుల్ మాట్లాడారు.
" నన్ను తోసివేయటం పెద్ద విషయం కాదు. యావత్తు దేశం దాడికి గురైంది. మనల్ని తోసివేసినా, లాఠీలతో కొట్టినా సరే ప్రజలకు అండగా నిలవటం మన విధి. హాథ్రస్ ఆందోళనల వెనక అంతర్జాతీయ కుట్ర ఉందని ఊహించుకొనే లేదా అలాంటి అభిప్రాయాన్ని వెల్లడించే విచక్షణాధికారం యోగి ప్రభుత్వానికి ఉంది. అయితే, దళిత యువతికి జరిగిన అన్యాయం విషాదకరమైనదని అంగీకరించటం ముఖ్యం"
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత.
వామపక్షాల నేతల పరామర్శ
హాథ్రస్ హత్యాచార బాధిత యువతి కుటుంబ సభ్యులను మంగళవారం వామపక్ష నేతలు పరామర్శించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అమర్జీత్ కౌర్ తదితరులు బాధిత కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.