మత విద్వేషం అత్యంత ప్రమాదకరం: రాహుల్ పాకిస్థాన్‌లోని నాన్కానా సాహిబ్ గురుద్వారాపై శుక్రవారం జరిగిన సామూహిక దాడిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించారు. ఈ దాడి తప్పుడు చర్య అంటూ ట్విట్టర్ వేదికగా అభివర్ణించారు.
"నాన్కానా సాహెబ్‌పై దాడి గర్హనీయం. కచ్చితంగా ఖండించాల్సిన విషయం. మత విద్వేషం ప్రమాదకరమైనది. ఇలాంటి పురాతనమైన విషపూరిత విధానానికి సరిహద్దులు ఉండవు. ప్రేమ, పరస్పర గౌరవం, అర్థం చేసుకోవడమే దీనికి విరుగుడు. "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
ఇదీ జరిగింది..
ఓ సిక్కు యువతిని అపహరించి హసన్ అనే యువకుడు వివాహం చేసుకుని మతమార్పిడి చేయించాడు. బలవంతపు మతమార్పిడి కింద కేసు నమోదు చేసిన పోలీసులు హసన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఫలితంగా కొంతమంది మద్దతుతో హసన్ కుటుంబ సభ్యులు గురుద్వారాపై దాడికి యత్నించారు.
బుకాయిస్తోన్న పాక్
పాక్ మాత్రం గురుద్వారాపై ఎలాంటి దాడి జరగలేదని బుకాయిస్తోంది. అయితే 'నగర్ కీర్తన్' సమయంలో గురుద్వారాలోకి వెళ్లేందుకు సిక్కులను పాక్ ప్రభుత్వం ఈ రోజు అనుమతించలేదని అక్కడి మీడియా తెలిపింది. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. నాన్కానా సాహిబ్‌ను సిక్కుల మతగురువు గురునానక్ జన్మస్థలంగా భావిస్తారు.
సిక్కుల ఆందోళన...
గురుద్వారాపై శుక్రవారం జరిగిన దాడికి నిరసనగా సిక్కులు ఆందోళనకు దిగారు. దిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. అకాలీదళ్, దిల్లీ గురుద్వారా కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. భారీసంఖ్యలో సిక్కులు చేరుకోవడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: పాక్‌లో గురుద్వారాపై దాడి..ఖండించిన భారత్..!