కాంగ్రెస్ పార్టీ పగ్గాలు మరోసారి యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీకే దక్కాయి. శనివారం రెండు సార్లు సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సుదీర్ఘ చర్చ అనంతరం.. ఆమెను తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. నూతన సారథిని ఎన్నుకునే వరకు ఆమె అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే కొనసాగాలని సీనియర్ నేతలు ఎంత ఒప్పించే ప్రయత్నం చేసినా ఆయన ససేమీరా అన్నారు. చివరకు రాహుల్ గాంధీ రాజీనామాను అంగీకరించింది పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ. పార్టీ సారథిగా ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సీడబ్ల్యూసీ ఆమోదించింది. అనంతరం.. సోనియాను తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రకటిస్తూ మరో తీర్మానాన్ని ఆమోదించింది.
''కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ సేవలను సీడబ్ల్యూసీ కొనియాడింది. పార్టీ కోసం ఆయన అంకితభావంతో పని చేశారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో సమర్థంగా పనిచేశారు. మహిళలు, వెనుకబడిన వర్గాలు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలకోసం ప్రతిరోజు పోరాటం చేశారు. అన్ని రాష్ట్రాల పీసీసీ, సీఎల్పీ, ఏఐసీసీ కార్యదర్శులు, ఫండింగ్ చేసేవారి ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్నాం. రాహుల్ గాంధీనే అధ్యక్షుడిగా కొనసాగాలని నిర్ణయించాం. అయితే రాజీనామా వెనక్కి తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. ఫలితంగా ఏఐసీసీ నిబంధనల మేరకు ఓటింగ్ జరిగే వరకు సోనియా గాంధీని తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరాం. అందుకు ఆమె అంగీకరించారు.''
- కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి