భారత్ భేరి: "గౌరవం"పై రాజకీయ దుమారం "మీరు గుర్తుకు తెచ్చుకోండి. 56 అంగుళాల ఛాతీ ఉందని చెప్పుకుంటున్న వారి ప్రభుత్వానికి ప్రస్తుతం జాతీయ భద్రత సలహాదారుడిగా ఉన్న అజిత్ డోభాల్... మసూద్ అజార్ 'గారి'ని విమానంలో కాందహార్‌లో దించి వచ్చారు." - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
ఈ నెల 11న దిల్లీలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఇవి. కాందహార్ విమానం హైజాక్ సమయంలో.... అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను విడిచిపెట్టిందని విమర్శించడం ఆయన ఉద్దేశం.
దిల్లీ సభలో మరెన్నో ఆరోపణలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు. రఫేల్ వ్యవహారం, నిరుద్యోగంపై అధికార పక్షాన్ని తప్పుబట్టారు. అవేవీ ఎవరికీ గుర్తులేవు. మసూద్ అజార్‌ను ఉద్దేశించి రాహుల్ అన్న మాటలే చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల వేళ పెను రాజకీయ దుమారం రేపాయి.
రాహుల్ మాటల్ని విమర్శనాస్త్రంగా మలుచుకుంది భాజపా. #RahulLovesTerrorists పేరిట ఆన్లైన్లో ప్రచారోద్యమం మొదలుపెట్టింది.
" రాహుల్‌గారు! అప్పట్లో దిగ్విజయ్ సింగ్ 'ఒసామాగారు, హఫీజ్ సయీద్ సాబ్' అని అన్నారు. ఇప్పుడు మీరు 'మసూద్ అజార్ జీ' అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది?"
-రవిశంకర్ ప్రసాద్, కేంద్ర మంత్రి
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.... రాహుల్ గాంధీకి, పాకిస్థాన్‌కు ఉగ్రవాదులంటే ప్రేమ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు.
"రాహుల్ గాంధీకి, పాకిస్థాన్‌కు తేడా ఏముంది? వారికి ఉగ్రవాదులంటే ప్రేమ. రాహుల్ గాంధీ ఉగ్రవాది మసూద్ అజార్‌కు ఇస్తున్న గౌరవాన్ని చూడండి."
-స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి
కేంద్రమంత్రులే కాదు... భాజపా సీనియర్ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలు మసూద్ అంశంపై సామాజిక మాధ్యమాల్లో విజృంభించారు. రాహుల్‌పై దుమ్మెత్తిపోస్తూ... ట్వీట్ల సునామీ సృష్టించారు.
కాంగ్రెస్ ఎదురుదాడి
భాజపా డిజిటల్ సైన్యం దాడితో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరైంది. అంతర్జాలం వేదికగానే ఎదురుదాడి ప్రారంభించింది.
"ప్రశ్న-1. ఉగ్రవాది మసూద్ అజార్‌కు కాందహార్‌లో అజిత్ డోభాల్ భద్రత కల్పించారా? లేదా?
ప్రశ్న-2. పఠాన్‌కోట్ ఉగ్రదాడిపై దర్యాప్తు చేసేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ తీవ్రవాదిని తీసుకొచ్చారా? లేదా?"
-రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్.... ముంబయి పేలుళ్ల సూత్రధారి, లష్కరే తొయిబా అధినేత హఫీజ్ సయీద్‌ను ఉద్దేశించి గతంలో అన్న మాటల్ని అస్త్రంగా మలుచుకుంది కాంగ్రెస్. హఫీజ్‌ను 'గారు' అని సంబోధించినట్లుగా ఉన్న ఆ వీడియోను #BJPLovesTerrorists హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేసింది.
కాంగ్రెస్ విమర్శల్ని తిప్పికొట్టారు రవిశంకర్. గతేడాది జరిగిన ఓ సమావేశంలో వ్యంగ్యంగా అలా అన్నానని, పూర్తి వీడియో చూస్తే అర్థం అవుతుందని స్పష్టంచేశారు.
"జిన్‌పింగ్ అంటే భయం..."
మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంపై ఐరాస భద్రతా మండలిలో జరిగిన పరిణామం... కాంగ్రెస్‌కు మరో ఆయుధంలా మారింది. అజార్‌పై ఆంక్షలు విధించడాన్ని చైనా అడ్డుకున్నా.... మోదీ ఎందుకు ఏమీ చేయలేదని నిలదీశారు రాహుల్.
"బలహీన మోదీకి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అంటే భయం. భారత ప్రయోజనాలకు విరుద్ధంగా చైనా వ్యవహరించినా మోదీ నోట ఒక్క మాటైనా రాదు.
చైనాతో మోదీ దౌత్యం ఎలా ఉంటుందంటే...
1. గుజరాత్లో జిన్‌పింగ్‌తో ఊయల ఊగడం
2. దిల్లీలో జిన్‌పింగ్‌ను ఆలింగనం చేసుకోవడం
3. చైనాలో జిన్‌పింగ్ ముందు తల వంచడం"
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
ఒకే ఒక్క పదంతో రేగిన దుమారం... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ రాజకీయాల్ని కుదిపేస్తోంది. ఈ వివాదం మున్ముందు ఇంకెలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.