కోర్టు ధిక్కరణ కేసు నుంచి విముక్తి కల్పించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీంను అభ్యర్థించారు. రఫేల్పై కోర్టు తీర్పును ప్రధాని నరేంద్రమోదీకి తప్పుగా ఆపాదించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పానని న్యాయస్థానానికి తెలిపారు.
రఫేల్ తీర్పులో 'కాపలాదారే దొంగ' అని సుప్రీంకోర్టే చెప్పిందని రాహుల్ వ్యాఖ్యలపై భాజపా నేత మీనాక్షి లేఖి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. తీర్పును రాహుల్ వక్రీకరించారని అభిప్రాయపడిన కోర్టు.. ఏప్రిల్ 23న నోటీసులు జారీ చేసింది.
మొదట రెండు సార్లు రాహుల్ దాఖలు చేసిన ప్రమాణ పత్రాలపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. స్పష్టమైన వివరణ ఇవ్వాలని మరో అవకాశం ఇచ్చింది న్యాయస్థానం. ఈ నేపథ్యంలో తప్పును అంగీకరించి బేషరతుగా క్షమాపణలు చెప్పారు రాహుల్.
"కోర్టు తీర్పును వక్రీకరించినందుకు తప్పును అంగీకరించి క్షమాపణలు చెప్పాం. మొదటి ప్రమాణ పత్రంలోనూ ఇదే పేర్కొన్నాం. ఈ కేసును కొట్టివేయాలి."