తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రఫేల్​: ఒప్పందమా? కుంభకోణమా?? అసలేం జరిగింది??? - రఫేల్ ఓ కుంభకోణమా?

రఫేల్​... శక్తిమంతమైన యుద్ధవిమానం. పొరుగు దేశాల నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్​ ఎంచుకున్న అస్త్రం. కానీ... 'రఫేల్​' రాజకీయ వివాదమైంది. సుప్రీంకోర్టు వేదికగా భారీ న్యాయపోరాటానికి కారణమైంది. ఎందుకు ఇదంతా? రఫేల్​ వ్యవహారంలో అసలేం జరిగింది?

రఫేల్​: ఒప్పందమా? కుంభకోణమా?? అసలేం జరిగింది???

By

Published : Nov 14, 2019, 5:48 AM IST

రఫేల్​: ఒప్పందమా? కుంభకోణమా?? అసలేం జరిగింది???

'రఫేల్​'... 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మోదీ సర్కారుపై కాంగ్రెస్​ చేసిన ప్రధాన విమర్శనాస్త్రం. పార్లమెంటులోనూ రఫేల్​ తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. అసలు రఫేల్​ చుట్టూ ఇంత చర్చ జరగడానికి కారణమేంటి?

యూపీఏలో మొదలు...

2012లో యూపీఏ సర్కార్‌ ఆధునిక యుద్ధ విమానాల కోసం అంతర్జాతీయ టెండర్లు ఆహ్వానించింది. అమెరికా, రష్యా, ఐరోపా దేశాల నుంచి వచ్చిన బిడ్లు పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం చివరకు ఫ్రాన్స్‌కు చెందిన డసో సంస్థ ఉత్పత్తి చేస్తున్న రఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

18 విమానాలు నేరుగా కొనుగోలు చేయాలని, రఫేల్ సంస్థ సాంకేతికత, విడి భాగాలు భారత్‌కు తీసుకొచ్చి బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌-హెచ్​ఏఎల్​లో 108 యుద్ధవిమానాలు తయారు చేయాలని నిర్ణయించారు. అయితే ధర, సాంకేతికత బదిలీ, నిర్వహణ వంటి అంశాల్లో ఏకాభిప్రాయం కుదరక అమలులో జాప్యం జరిగింది. ఈలోపు యూపీఏ సర్కార్ పోయి ఎన్​డీఏ అధికారంలోకి వచ్చింది.

ఒప్పందంలో మార్పు...

మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం యూపీఏ నిర్ణయానికి భిన్నంగా ఎగరడానికి సిద్ధంగా ఉన్న 36 విమానాలను నేరుగా రఫేల్ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. సాంకేతికతను కొనుగోలు చేసి దేశీయంగా హాల్‌లో యుద్ధవిమానాల తయారీ ఆలోచనను విరమించుకుంది. ఈ మేరకు 2016 సెప్టెంబరులో ఫ్రాన్స్‌తో ఒప్పందంపై సంతకం చేశారు మోదీ.

ఈ ఒప్పందం ప్రకారం 36 యుద్ధవిమానాల కోసం రఫేల్‌ సంస్థకు 58 వేల కోట్లు చెల్లించాలి. ఒప్పందం విలువలో 50 శాతం విలువను భారత్‌లో డసో సంస్థ తిరిగి పెట్టుబడులు పెట్టాలి. అందులో భాగంగా డసో సంస్థ భారతీయ ఆఫ్‌సెట్ భాగస్వామిగా ప్రభుత్వ రంగ సంస్థ హెచ్​ఏఎల్​ను కాదని.. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌ సంస్థను ఎంచుకుంది. ఈ నిర్ణయం వివాదానికి దారితీసింది.

ఆరోపణలు...

36 విమానాల కొనుగోలు ధరను మోదీ సర్కార్‌ అమాంతం పెంచేసిందని విపక్షాలు ఆరోపించాయి. 2015 ఏప్రిల్‌లో ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ పర్యటనకు బయలుదేరడానికి 10 రోజుల ముందే అనిల్‌ అంబానీ 'రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌' కంపెనీని ప్రారంభించారు. అప్పటికీ కనీసం లైసెన్స్‌ కూడా లేని రిలయన్స్‌ సంస్థతో డసో చేతులు కలపడం అనేక అనుమానాలకు తావిచ్చింది. అనిల్‌ అంబానీకి మేలు చేసేందుకే యుద్ధ విమానాల ధరలు అమాంతం పెంచేశారని కాంగ్రెస్ ఆరోపించడం వల్ల వివాదం తీవ్రమైంది. ఈ అంశం పార్లమెంటులోనూ ప్రకంపనలు సృష్టించింది.

మరింత దుమారం...

2018 సెప్టెంబర్‌లో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండె.."భారత ప్రభుత్వమే రఫేల్ ఒప్పందం కోసం రిలయన్స్ డిఫెన్స్ పేరును సూచించిందని, ఆ విషయంలో ఫ్రాన్స్ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది" అని చెప్పడం వల్ల దుమారం మరింత తీవ్రమైంది.

అయితే, భారత రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం ఈ నిర్ణయం వెనుక భారత, ఫ్రాన్స్ ప్రభుత్వాల ప్రభావం లేదని, తమ భారత భాగస్వామ్య కంపెనీని ఎంచుకునే స్వేచ్ఛ డసోకు ఉందని చెప్పింది. ఈ నేపథ్యంలో రఫేల్‌ కొనుగోలు ఒప్పందంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మాజీ మంత్రులు అరుణ్‌ శౌరి, యశ్వంత్‌ సిన్హా సహా ఎమ్​ఎల్​ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే 2018 డిసెంబర్ 14న ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మోదీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది. రూ. 58 వేల కోట్లు విలువైన ఈ ఒప్పందంలో అవినీతి జరిగినట్లు ఏ విధమైన ఆధారాలు కనిపించలేదని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.

తీర్పుపై సమీక్ష కోరుతూ...

ఆ తర్వాత రఫేల్‌ ఒప్పందంపై ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ పిటిషనర్లు మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రఫేల్ వ్యవహారంలో ఎన్నో నిజాలను కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానానికి చెప్పకుండా తప్పుదారి పట్టించిందని పిటిషన్లలో పేర్కొన్నారు.

కేంద్రం మాత్రం.. అంతర్జాతీయ ఒప్పందం మేరకు రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ధరలను బహిర్గతం చేయరాదని.. గతంలోనూ పిటిషనర్లు ఇవే వాదనలు వినిపించారని వాదించింది. సమీక్షా పిటిషన్లపై వాదనలు విన్న దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ ఏడాది మే 10న తీర్పును రిజర్వులో ఉంచింది.

ఇదీ చూడండి:అంచనాలను అందుకోలేకపోతున్న సీజీఎస్టీ రాబడులు

ABOUT THE AUTHOR

...view details