చైనాతో ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ.. అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌కు చేరిన విషయం తెలిసిందే. అయితే, వీటి రాకతో చైనా ఆందోళనకు గురికావడం నిజమేనని భారత వైమానిక దళాధిపతి భదౌరియాస్పష్టంచేశారు. చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభన నెలకొన్న కారణంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామని ఐఏఎఫ్ చీఫ్ పేర్కొన్నారు.
‘ప్రస్తుతం సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఇరు దేశాల సైనికాధికారులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. చర్చలు ఫలప్రదమౌతాయనే అశిస్తున్నాం. కానీ, ఒకవేళ కొత్త పరిస్థితులు ఎదురైతే మాత్రం వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇందుకు అవసరమైనన్ని బలగాలను రంగంలోకి దించాం’ అని భారత వైమానిక దళాధిపతి ఆర్‌కేఎస్ భదౌరియా ఓ వార్తా ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు.
సరిహద్దు ప్రాంతంలో చైనా బలగాలను తగ్గించుకున్నప్పటికీ, ఇతర చర్యల ద్వారా రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఇందులో భాగంగా జే-20 యుద్ధవిమానాలను రంగంలోకి దించింది. వాటికి అనుగుణంగానే భారత్ కూడా వ్యూహాలు మారుస్తూ ముందుకెళ్తున్నామన్నారు. ఈ సందర్భంగా రఫేల్ రాక చైనాలో ఆందోళనకు కారణమయ్యిందా? అనే ప్రశ్నకు భారత వైమానిక దళాధిపతి కచ్చితంగా అవుననే సమాధానమిచ్చారు.