తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాధా దేవి... అక్కడి ప్రజల 'ఆశా'జ్యోతి!

గర్భిణులకు ప్రసవమైనా, కుష్టు రోగులకు చికిత్స అవసరమైనా, స్థానికులు అస్వస్థతకు గురైనా వెంటనే వారి ముందు వాలిపోతారు రాధా దేవి. ఒకప్పుడు ప్రాణాలపై మక్కువ వదిలేసి ఆత్మహత్యాయత్నం చేసిన రాధ.. ఇప్పుడు ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు. ఆశా కార్యకర్తగా తన సేవలతో అందరి ఆదరణ దక్కించుకుంటున్నారు.

Radha Devi, Sahiya
రాధా దేవి... తర్వాదిహ్ ప్రజల 'ఆశా'జ్యోతి!

By

Published : Nov 14, 2020, 7:03 AM IST

రాధా దేవి... తర్వాదిహ్ ప్రజల 'ఆశా'జ్యోతి!

రాధ...ఝార్ఖండ్​ లాతెహార్ జిల్లాలోని తర్వాదిహ్ పంచాయత్​లో ఉండే ప్రజలకు సుపరిచితమైన పేరు. ఇక్కడి వారు కాస్త అస్వస్థతకు గురయ్యారంటే వారి మనసుల్లో మెదిలేది, వారి నోటి వెంట వచ్చేది ఈ పేరే. ఈ ఒక్క పిలుపుతో వెంటనే వారి ముందు ప్రత్యక్షమవుతారు రాధా దేవి. వారికి కావాల్సిన వైద్యం అందిస్తారు. వందల మందికి సేవలు చేసిన ఈ నారీమణి గత జీవితమంతా కష్టాలమయమే. భర్త చిత్రహింసలు తాళలేక 16 ఏళ్ల క్రితం ఆత్మహత్యకు యత్నించారు.

"నా భర్త పెట్టే హింసను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. నేను బతికుండాలని భూమి మీద కోరుకునేవారు ఎవరూ లేరనే భావన ఉండేది."

-రాధా దేవి, ఆశా కార్యకర్త

కూలీ పని చేసుకుంటూ తన పిల్లల్ని చూసుకునేవారు రాధ. మద్యానికి బానిసైన భర్త... రోజూ విచక్షణా రహితంగా ఆమెపై దాడిచేసేవాడు. దీంతో తనువు చాలించాలని భావించి ఒంటికి నిప్పంటించుకున్నారు. చివరకు కాలిన గాయాలతో బతికి బయటపడ్డారు.

"నేను ఇటుక బట్టీలో పనిచేసేదాన్ని. నాకు పిల్లలు ఉన్నారు. వారిని పోషించడానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒక్కోసారి ఇటుక బట్టీలతో పాటు కూలీగానూ పనులు చేసేదాన్ని. చాలా కష్టాలు పడి పిల్లలను పెంచాను."

-రాధా దేవి, ఆశా కార్యకర్త

ఆత్మహత్యాయత్నం తర్వాత కోలుకున్న రాధ.. తన బతుకు బండిని తిరిగి మొదలుపెట్టారు. అదేసమయంలో గ్రామంలో హెల్త్ వర్కర్ల నియామకాలు ప్రారంభం కాగా... సాహియా గ్రామానికి కార్యకర్తగా ఎంపికయ్యారు. దీంతో రాధ జీవితంలో నూతన అధ్యాయం మొదలైంది.

ఆశా కార్యకర్తగా మారిన తర్వాత గ్రామంలోని ప్రజలకు వైద్య సేవలపై అవగాహన కల్పించడం మొదలు పెట్టారు. ప్రసవం కోసం గర్భిణులను ఆస్పత్రిలో చేరేలా ఒప్పించారు. ఇంట్లో ప్రసవం చేస్తే కలిగే నష్టాలను వివరించారు. రాత్రీ, పగలూ తేడా లేకుండా ఆపదలో ఉన్నవారికి విధిగా వైద్యసాయం అందించారు. రాధ చూపించే ప్రత్యేక శ్రద్ధ వల్ల గ్రామంలోని గర్భిణులు, శిశువులు, బాలింతల ఆరోగ్యం మెరుగుపడింది. గర్భిణులతో పాటు టీబీ, కుష్టు రోగుల ఆరోగ్యంపై పర్యవేక్షణ అధికమైంది. దీంతో రాధ చేసే సాయం పట్ల గ్రామస్థుల్లో ఆదరణ పెరిగింది. అనుక్షణం బాధితుల కోసం అందుబాటులో ఉండే ఆమెను ఇప్పుడు గ్రామస్థులంతా రాధా దీదీ అని ప్రేమగా పిలుచుకుంటున్నారు.

"నేను అనారోగ్యంగా ఉన్నానని రాధకు చెప్పాను. ఆమె వచ్చి కొన్ని పరీక్షలు చేసింది. తర్వాత చికిత్స కూడా చేయించింది."

-మహేంద్ర భునియా, గ్రామస్థుడు

"ప్రసవం సమయంలో రాధా దేవి అన్ని రకాలుగా సాయం చేస్తుంది. గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్లడం దగ్గరి నుంచి వారిని తిరిగి ఇంటికి తీసుకొచ్చే వరకు జాగ్రత్తగా చూసుకుంటుంది."

-సిధ్వా దేవి, గ్రామస్థురాలు

"రక్త మార్పిడి సహా ఆమె అన్ని రకాలుగా నాకు చికిత్స చేసింది. దీనంతటికీ రాధా దేవినే కారణం."

-కవితా దేవి, గ్రామస్థురాలు

"తర్వాదిహ్ పంచాయత్​లో రాధ చాలా ముఖ్యమైన వ్యక్తి. వైద్యం అవసరమయ్యే ప్రతీ ఒక్కరికీ రాత్రి, పగలు తేడా లేకుండా సాయం చేస్తారు. ఎవరికైనా డబ్బులు లేకపోయినా.. చికిత్స కోసం తన డబ్బును ఇస్తారు."

-సందీప్ కుమార్, ఉపాధ్యాయుడు

గ్రామస్థులకు ఏదైనా సాయం చేయాలని అనుకుంటే వెనుదిరిగి చూడకుండా సాగిపోతున్నారు రాధా దేవి. జీవితం మీద విరక్తితో ప్రాణాలు తీసుకోవాలని భావించిన ఆవిడే.. ఇప్పుడు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.

"ప్రతీ ఒక్కరికీ రాధ అండగా ఉంటారు. ప్రసవం కోసం ఎక్కడికైనా వెళ్లాలన్నా వెనకడుగు వేయరు. వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినా తప్పకుండా ముందుంటారు."

-పూనమ్ ఖాల్ఖో, నర్సు

"ఇప్పటివరకు సుమారు 35 మంది టీబీ రోగుల జీవితాలను కాపాడాను. రాంచీ నుంచి లాతెహార్​ వరకు ఎంతో మందికి చికిత్స చేశాను. ప్రసవాల విషయంలో లెక్కలేనంత మందికి సహాయపడ్డాను. ఏటా 60 నుంచి 65 ప్రసవాలు జరుగుతూనే ఉంటాయి. ఎవరి దగ్గరైనా డబ్బు తక్కువగా ఉంటే చికిత్స కోసం నా వంతు సాయం చేశాను."

-రాధా దేవి, ఆశా కార్యకర్త

జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎన్నో సత్కారాలు అందుకున్నారు రాధా దేవి. అప్పటి ఝార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ సైతం ఆమె గౌరవార్థం జ్ఞాపికలు బహూకరించారు. రాధ నిబద్ధత, అంకితభావాన్ని చూసి గ్రామస్థులతో పాటు అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

"అందరు వైద్య కార్యకర్తలు రాధా దేవిలా ఉండాలి. ఆమె నుంచి స్ఫూర్తి పొందాలి."

-జులేశ్వర్ లోహ్రా, పంచాయతీ అధ్యక్షుడు

"రాధా దేవి సహియాను చూసి మిగిలిన వైద్య సేవల సిబ్బందికి సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. రాధను అందరూ ప్రేరణగా తీసుకొని విధుల పట్ల అంకితభావంగా ఉండాలి."

-డా. ఎస్​కే శ్రీవాస్తవ, సివిల్ సర్జన్

"మనం ఏ స్థాయిలో పనిచేస్తున్నామనేది ముఖ్యం కాదు. ఎంత నిబద్ధతతో పని చేస్తున్నామనేదే ముఖ్యం. ఓ ఆశా కార్యకర్తగా రాధా దేవి చేస్తున్న పని ప్రశంసనీయం."

-జిషాన్ కమర్, డిప్యూటీ కమిషనర్

రోగులకు సేవ చేయడం ద్వారా వచ్చే సంతృప్తితో తన గత స్మృతులను మర్చిపోగలుగుతున్నారు రాధ. తాను ఎదుర్కొన్న బాధలను పక్కనబెట్టి ఇప్పుడు సంతోషంగా జీవిస్తున్నారు.

"మహిళలు ఎదుర్కొనే బాధలు ఇంకో మహిళకే తెలుస్తాయి. మీరొక ఆశా కార్యకర్తనా అనే దాంతో సంబంధం లేదు."

-రాధా దేవి, ఆశా కార్యకర్త

ఒకప్పుడు.. భూమ్మీద తను జీవించి ఉండాలని కోరుకునే వారు లేరని బాధపడ్డ రాధా దేవి సేవల కోసం ఇప్పుడు ఎంతో మంది ప్రజలు వేచి చూస్తున్నారు. కష్టాలతో యుద్ధం చేసి విజయం సాధించిన ఆమె జీవిత ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఇబ్బందులు ఎదురైతే పోరాడాలి తప్ప.. లోకాన్ని విడిచిపెట్టడం మార్గం కాదనేందుకు రాధా దేవి సజీవ సాక్ష్యం.

ABOUT THE AUTHOR

...view details