దిల్లీ శాసనసభ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 8 సీట్లను భాజపా తన ఖాతాలో వేసుకుంది. ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం అవసరమైన సంఖ్యాబలం తమకు ఉన్న కారణంగా ఈ పదవికి ప్రస్తుతం తీవ్రపోటీ నెలకొంది. సీనియర్ నేతలు సహా మొత్తంగా ఐదుగురు శాసనసభ్యులు ఈ పదవికి ఔత్సాహికులని తెలుస్తోంది.
రోహిణి నియోజకవర్గ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా, కరవాల్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మోహన్ సింగ్ బిస్త్, బదర్పుర్ శాసనసభ్యుడు రామ్వీర్ సింగ్ భిదూరీల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొందని సమాచారం. ప్రస్తుతం ఎన్నికైన శాసనసభ్యుల్లో మోహన్ బిస్త్ సీనియర్. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదేసమయంలో విజేందర్ గుప్తా భాజపా దిల్లీ విభాగం మాజీ అధ్యక్షుడు. ఐదు దశాబ్దాల రాజకీయ ప్రయాణం.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రామ్వీర్ భిదూరీ ప్రతిపక్షనేత పదవికి మరో ఔత్సాహికుడు. ఈయనను 2003-04 సంవత్సరంలో ఉత్తమ శాసనసభ్యుడి అవార్డు వరించింది.