బిహార్‌లో ప్రధాన రాజకీయ పార్టీలైన జేడీయూ, ఆర్జేడీ విలీనం వ్యవహారంపై మాటలయుద్ధం తీవ్రమైంది. లాలూ, ఆయన భార్య రబ్రీ చేసిన ఆరోపణలను జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ ఖండించారు. లాలూ బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు.
ఇదీ కథ
జనతా దళ్ యునైటెడ్, రాష్ట్రీయ జనతా దళ్... ఒకప్పుడు బద్ధశత్రువులు. అనూహ్యంగా 2015 శాసనసభ ఎన్నికల కోసం ఒక్కటయ్యాయి. జట్టుగా పోటీచేసి గెలిచాయి. జేడీయూ-ఆర్జేడీ పొత్తు ఎంతోకాలం కొనసాగలేదు. 2017 జులైలో లాలూతో తెగదెంపులు చేసుకున్నారు నితీశ్ కుమార్. తిరిగి ఎన్డీఏలో చేరారు.
ఏడాదిన్నర తర్వాత జేడీయూ-ఆర్జేడీ బంధం మరోమారు చర్చనీయాంశమైంది. రెండు పార్టీల విలీనానికి నితీశ్ ప్రతినిధిగా జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ తన వద్దకు వచ్చారని ఇటీవల లాలూ తన ఆత్మకథలో చెప్పడం వివాదానికి మూలకారణమైంది. ఇదే విషయం చెప్పారు లాలూ భార్య, ఆర్జేడీ ఉపాధ్యక్షురాలు రబ్రీ దేవి.
''ప్రశాంత్ కిషోర్ 5 సార్లు మా ఇంటికి వచ్చారు. నేను మండిపడ్డాను. ఆయనను బయటకు వెళ్లమని కోరాను. ఒకసారి ఆర్జేడీకి ద్రోహం చేసిన తర్వాత.. నాకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై నమ్మకం లేదు.''
- రబ్రీ దేవి, ఆర్జేడీ ఉపాధ్యక్షురాలు