కిశోర ప్రాయంలో ఉన్న ఒక మగ పులి కొత్త ప్రాంతం, ఆడ పులి సాహచర్యం కోసం ఏకంగా 1300 కిలోమీటర్లు ప్రయాణించిందట. ఈ మేరకు మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు సంబంధిత వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర, తెలంగాణలోని ఆరు జిల్లాల గుండా దీని పయనం సాగిందని చెప్పారు. చివరకు మహారాష్ట్రలోని బుల్డానా జిల్లాలోని ధ్యానగంగ అభయారణ్యాన్ని చేరిందన్నారు.
అనువైన చోటు కోసం...
టీబ్ల్యూఎల్‌ఎస్-టీ1-సీ1 అనే పులి యావత్మాల్ జిల్లాలోని తిపేశ్వర్ పులుల అభయారణ్యంలో 2016లో పుట్టింది. సీ2, సీ3 అనే రెండు మగ పులులు కూడా అదే తల్లికి పుట్టాయి. కిశోర ప్రాయంలో ఉండే పులులు తమకంటూ ఒక ప్రత్యేక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అందులో భాగంగా అనువైన చోటును గుర్తించేందుకు గాలింపు చేపడతాయి.
ఆ తీరుతెన్నులను అధ్యయనం చేసేందుకు ఈ ఏడాది మార్చిలో అధికారులు సీ1, సీ3 పులులకు రేడియో కాలర్లు అమర్చి, వాటి కదలికలను పరిశీలించారు. జూన్‌లో అవి తిపేశ్వర్ అభయారణ్యాన్ని వీడాయి. తొలుత అవి పక్కనే ఉన్న పంధార్‌కవాడా డివిజన్‌కు, ఆ తర్వాత తెలంగాణకు చేరాయి.