తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విదేశాల నుంచి వచ్చేవారికి క్వారంటైన్​ సడలింపు - quarantine rules change

విదేశాల నుంచి వచ్చేవారు కరోనా సోకలేదని ధ్రువీకరించేలా వ్యాధి నిర్ధరణ పరీక్ష నివేదిక సమర్పిస్తే వ్యవస్థాగత (ఇన్‌స్టిట్యూషనల్‌) క్వారంటైన్‌ అవసరం లేదని తెలిపింది కేంద్రం. భారత్‌కు ప్రయాణం ప్రారంభించడానికి 96 గంటల్లోపు చేయించుకున్న పరీక్షకు సంబంధించిన నివేదికనే ప్రయాణికులు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నెల 8 నుంచి ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పింది.

QUARANTINE RULES FOR FOREIGNERS
విదేశాల నుంచి వచ్చేవారికి క్వారంటైన్​ సడలింపు

By

Published : Aug 3, 2020, 1:18 PM IST

విదేశాల నుంచి భారత్‌కు వచ్చేవారికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం కాస్త సడలించింది. కరోనా సోకలేదని ధ్రువీకరించేలా వ్యాధి నిర్ధారణ పరీక్ష రిపోర్టును సమర్పించేవారికి వ్యవస్థాగత (ఇన్‌స్టిట్యూషనల్‌) క్వారంటైన్‌ నుంచి మినహాయింపునిచ్చింది. ఈ నెల 8 నుంచి ఈ వెసులుబాటు అమల్లోకి వస్తుందని తెలిపింది. భారత్‌కు ప్రయాణం ప్రారంభించడానికి 96 గంటల్లోపు చేసుకున్న పరీక్షకు సంబంధించిన రిపోర్టునే ప్రయాణికులు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. తప్పుడు నివేదికలు సమర్పిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విదేశాల నుంచి వచ్చేవారికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఈ మేరకు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కుటుంబ సభ్యులు చనిపోవడం, తీవ్ర అనారోగ్యం, గర్భం, పదేళ్లలోపు కుమారులు/కుమార్తెలు ఉండటం వంటి తప్పనిసరి కారణాలతో భారత్‌కు వచ్చేవారు ఇకపై 14 రోజుల హోం క్వారంటైన్‌ను ఎంచుకోవచ్చునని కూడా అందులో పేర్కొంది. ఇందుకోసం భారత్‌కు ప్రయాణం ప్రారంభించడానికి కనీసం 72 గంటల ముందు ఆన్‌లైన్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇన్నాళ్లూ వారు తొలుత ఏడు రోజులు సొంత ఖర్చులతో వ్యవస్థాగత క్వారంటైన్‌లో ఉండి, ఆపై ఏడు రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చేది.

మరిన్ని మార్గదర్శకాలివీ..

  • విమానాలు, నౌకల ద్వారా భారత్‌కు వచ్చేవారంతా తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాత.. కరోనా లక్షణాలేవీ లేనివారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.
  • కొవిడ్‌ లేదని రిపోర్టు సమర్పించినవారు, తప్పనిసరి పరిస్థితుల్లో భారత్‌కు వస్తున్నవారు కాకుండా మిగతా వారంతా 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంటామంటూ స్వీయ అంగీకార పత్రం సమర్పించాలి. ఇందులో ఏడు రోజులు సొంత ఖర్చుపై వ్యవస్థాగత క్వారంటైన్‌లో ఉండాలి. తర్వాతి ఏడు *రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి.
  • రోడ్డు మార్గాల్లో వచ్చేవారికి కూడా ఇవే మార్గదర్శకాలు వర్తిస్తాయి.
  • వ్యవస్థాగత క్వారంటైన్‌లో ఉన్నప్పుడు పాజిటివ్‌గా తేలితే.. వారిని ఆస్పత్రులకు తరలిస్తారు. వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉంటే హోం క్వారంటైన్‌లో ఉండేందుకు అనుమతిస్తారు.

ఇదీ చూడండి: దేశంలో ఆ వ్యాక్సిన్ ట్రయల్స్​కు గ్రీన్​ సిగ్నల్!

ABOUT THE AUTHOR

...view details