దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో మెజారిటీ రాష్ట్రాలు లాక్డౌన్ను ప్రకటించాయి. అయితే కొందరు ఈ నిర్బంధాన్ని లెక్కచేయకపోవడాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. కర్ణాటకలో మార్చి 31 వరకు ప్రజలంతా లాక్డౌన్ను అనుసరించాలని ప్రభుత్వం కోరింది. ఎవరైనా నిర్బంధాన్ని అతిక్రమిస్తే ఆరునెలల జైలుశిక్ష, జరిమానా విధిస్తామని హెచ్చరించింది. నిర్బంధ కాలం ముగిసే వరకు ఎక్కడివారు అక్కడే ఉండాలని హోం మంత్రి బసవరాజ్ ఆదేశించారు.
ప్రజల క్షేమం కోసమే...
కరోనా వ్యాప్తి దృష్ట్యా దిల్లీలో సైతం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. ప్రజలంతా నిర్బంధానికి మద్దతివ్వాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. అత్యవసర సేవలకోసం 50 శాతం దిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(డీటీసీ) బస్సులను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ప్రజల క్షేమం కోసమే నిర్బంధాన్ని విధించినట్లు వివరించారు.