ఒడిశాలోని పిపిలీ అల్లికలు.. సునిశిత కళకు, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్న కళాఖండాలు. అప్పట్లో ఉత్కల్‌గా పేరొందిన పురాతన ఒడిశాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ ప్రాచీనకళ రాష్ట్రానికి ప్రత్యేక శోభ తెచ్చింది. పూరీని సందర్శించే అంతర్జాతీయ ప్రర్యటకులకు పిపిలీ నగరం ప్రత్యేక ఆకర్షణ.
12వ శతాబ్దం నుంచే..
ఈ హస్తకళ 12వ శతాబ్దం నుంచే పూరీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మొదట్లో ఈ కళతో కళాకారులు పెద్దపెద్ద గొడుగులు, జెండాలు, విసెనకర్రలు, కుంచెలు తయారుచేసి, జగన్నాథ స్వామికి పంపేవారు. ఇక్కడ తయారుచేసిన పందిళ్లను పండగల వేళ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేవారు. చేపలు, చిలకలు, అరటాకులు, తులసి దళాల చిత్రాలతో వాటిని సుందరంగా తీర్చిదిద్దేవారు.
"ఈ అల్లికలు ఎప్పటినుంచి జగన్నాథాలయం సంప్రదాయంలో భాగంగా ఉన్నాయో కచ్చితంగా చెప్పడం కొంచెం కష్టమే. జగన్నాథ స్వామి ఆలయానికి, ఈ అల్లికలకు ఉన్న సంబంధం నాణేనికి చెరో వైపు లాంటింది. జగన్నాథుడి ప్రత్యేక కార్యక్రమాలు చాండువాల కిందే జరుగుతాయి. జగన్నాథుడి లాగే ఈ అల్లికలు కూడా ప్రత్యేకం."
---డా. నరేష్ డాష్, జగన్నాథ్ కల్చర్ పరిశోధనకారుడు
వేలాది కుటుంబాలకు జీవనాధారం
పిపిలీ అల్లికలకు క్రమంగా డిమాండ్ పెరగడం వల్ల డిజైన్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు కళాకారులు విభిన్న ఆకృతులతో అందమైన అలంకరణ వస్తువులు తీర్చిదిద్దుతున్నారు. పర్సులు, వాల్ హ్యాంగింగ్స్, టేబుల్ క్లాత్ లాంటి వస్తువులు చేసి, విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఇదో పరిశ్రమ స్థాయికి ఎదిగి, వేలాది కుటుంబాలకు జీవనాధారంగా మారింది.