తెలంగాణ

telangana

లాక్​డౌన్ ఆంక్షల సడలింపు దిశగా కేంద్రం అడుగులు?

By

Published : Apr 13, 2020, 5:45 AM IST

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్రం ఇరవై రోజులుగా దేశవ్యాప్త లాక్​డౌన్ అమలు చేస్తోంది. రేపటితో లాక్​డౌన్ గడువు తీరిపోనుంది. వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు మరిన్ని రోజులు నిర్బంధం కొనసాగాల్సిందేనని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్​డౌన్​పై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ కారణంగా కొన్ని సడలింపులతో ఆంక్షలను కొనసాగించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని సమాచారం.

corona
లాక్​డౌన్ ఆంక్షల సడలింపు దిశగా కేంద్రం అడుగులు?

దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో 21 రోజుల లాక్​డౌన్ ప్రకటించింది కేంద్రం. అయితే ఈ ఆంక్షల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యవసర సేవల సిబ్బందిపై ప్రజలు ఎదురుతిరుగుతున్న ఘటనలు ఆయాచోట్ల నమోదయ్యాయి. పంజాబ్​లో ఆంక్షలు అమలు చేసేందుకు ప్రయత్నించిన పోలీసు అధికారి చెయ్యిని నరికేసింది ఓ సిక్కు మతబృందం. అయితే మంగళవారంతో లాక్​డౌన్​ గడువు తీరిపోనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆంక్షలను క్రమంగా సడలించనున్నట్లు తెలుస్తోంది.

ఆంక్షల పొడిగింపు అంశంపై ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంప్రదింపులు జరిపారు. ఆయా పక్షాలు, నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని.. ప్రజా సౌలభ్యం కోసం లాక్​డౌన్ నిబంధనల్లో మార్పులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభం..

శనివారం ప్రధాని-ముఖ్యమంత్రుల మధ్య జరిగిన వీడియో కాన్ఫరెన్స్​ సంభాషణలో.. వ్యవసాయం సహా వివిధ అత్యవసర రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలకు అనుమతివ్వాలని పలువురు సీఎంలు కేంద్రాన్ని అభ్యర్థించారు. వస్త్ర పరిశ్రమ, రసాయన, ఎలక్ట్రానిక్స్, ఉక్కు, ఫార్మా వంటి కీలకమైన ఐదు రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రాలతో చర్చించింది కేంద్రం. ఈ మేరకు ఆయా రంగాల్లో సడలింపులు వెలువడే అవకాశం ఉంది. జాతీయ రహదారుల నిర్మాణంపైనా రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ నిర్మాణ కార్యకలాపాలు కూడా ఊపందుకునే సూచనలు కన్పిస్తున్నాయి.

వైరస్ పరీక్షల సంఖ్య పెంపు దిశగా..

వైరస్ పరీక్షల సంఖ్యను పెంచాలని ప్రభుత్వానికి పలువర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఆయా వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని.. పరీక్షల సంఖ్యను పెంచే దిశగా నిర్ణయం తీసుకుంది కేంద్రం. అవసరమైన పరీక్ష కిట్లను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేసింది ఆరోగ్య శాఖ. పరీక్షల కోసం ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలనూ వినియోగించుకోనున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి:తండ్రికి గడ్డం పెరిగితే కుమారుడే దిక్కయ్యాడు

ABOUT THE AUTHOR

...view details