పెళ్లి అంటే మరో జీవితానికి ముఖద్వారం వంటిది. జీవితంలోని కీలకమైన ఈ ఘట్టాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. తమ వాళ్ల మధ్య సరదాగా జీవితంలోని ముఖ్యమైన మెట్టును అధిరోహించాలని కోరుకుంటారు. అయితే లాక్డౌన్ కారణంగా అనేక వివాహాలు వాయిదా పడ్డాయి. మరికొంతమంది ప్రభుత్వ ఆంక్షలను అనుసరించి పరిమితమైన అతిథులతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే పెళ్లికి వధూవరుల బంధువులు హాజరుకాలేకపోయినప్పటికీ చొరవ తీసుకుని వివాహం జరిపించారు పుణె పోలీసులు. కన్యాదానం చేసి పెళ్లి పెద్దలుగా మారారు. అన్ని ఏర్పాట్లు చేసి లాక్డౌన్ వేళ ప్రజలకు ఆత్మీయ బంధువులం మేమేనంటూ ఢంకా భజాయించారు.
ఇదీ జరిగింది..
దెహ్రడూన్కు చెందిన ఆర్మీ మాజీ అధికారి దేవేంద్ర సింగ్ కుమారుడు ఆదిత్యకు.. నాగపుర్‌కు చెందిన ఆర్మీ రిటైర్డ్ కల్నల్ కుశ్వాహ కుమార్తె, వైద్యురాలు స్నేహకు ఫిబ్రవరి మొదటివారంలో నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి మే 2ను ముహూర్తంగా నిర్ణయించారు.
అయితే లాక్డౌన్ కారణంగా కుటుంబసభ్యులు వారి స్వస్థలాల్లో ఉండిపోయారు. వరుడు ఆదిత్య పుణెలో ఉన్నాడు. వధువు స్నేహ.. నాగపుర్ ఎయిమ్స్‌లో వైద్యురాలిగా సేవలందిస్తోంది. కుటుంబసభ్యుల వినతి మేరకు పెళ్లి ఏర్పాట్లు చేశారు హదప్సర్ పోలీసులు. కన్యాదానమూ వారే చేశారు. అలా శనివారం మధ్యాహ్నం నిరాడంబరంగా .. భౌతిక దూరం నిబంధనలను పాటిస్తూ వివాహం జరిగింది.