ఈమె డాక్టర్ హేమా సానే. వయసు 79ఏళ్లు. ఉండేది మహారాష్ట్ర పుణె బుధవారపు పేట్ ప్రాంతంలో. సావిత్రీబాయి పూలే విశ్వవిద్యాలయం నుంచి వృక్ష శాస్త్రంలో పీహెచ్డీ పట్టా పొందారు. పుణె గర్వారే కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేశారు. అనేక పుస్తకాలు రాశారు.
ఉన్నత చదువు, ఉద్యోగం.. ఇది హేమ నేపథ్యం. ఆమె జీవనశైలి ఎంతో ఖరీదైనదిగా ఉండొచ్చని అంతా భావిస్తారు. వాస్తవం అందుకు పూర్తి విరుద్ధం. ఒక చిన్న ఇంట్లో ఉంటారామె. అదీ విద్యుత్ లేకుండా.. ఆమెతో కలిసి ఉండేది... ఓ కుక్క, రెండు పిల్లులు, ఓ ముంగిస, పక్షులు, చెట్లే.
పుట్టినప్పటి నుంచి విద్యుత్ వాడకుండా ఉంటున్నానని గర్వంగా చెబుతారు హేమ.
"నేను జీవించగలను. ఎలాంటి కష్టం లేదు. మీరెలా బతుకుతారో నేనూ అలానే. మనకు ప్రాథమిక అవసరాలేంటి? తిండి, గూడు. అవి చాలు. విద్యుత్ తదనంతరం వచ్చింది. ఒకప్పుడు అసలు కరెంటు ఉండేది కాదు. అప్పుడు జనం ఏం చేసేవారు? నేను బతకగలను. ఇంతకుముందు నాకు గ్యాస్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు కిరోసిన్ బ్లాక్ మార్కెట్లో మాత్రమే దొరుకుతోంది. అది కూడా పెట్రోల్ ఎంత ధర ఉందో అంతలో. దాదాపు రూ.80కి లీటరు. నా దగ్గరున్నది చెమటోడ్చి కష్టపడ్డ సొమ్ము. నేను బ్లాక్లో కొనొద్దనే గ్యాస్ వాడుతున్నా. నాకు మూడు నెలలు వస్తుంది."
-హేమా సానే