ఉగ్రవాదులను నిలువరించే ప్రయత్నంలో తన ప్రాణాలను పణంగా పెట్టిన 'కేంద్ర రిజర్వ్ పోలీసు దళం' (సీఆర్‌పీఎఫ్) సహాయ సబ్ ఇన్‌స్పెక్టర్ మోహన్‌లాల్ ధైర్య సాహసానికి గుర్తింపుగా అత్యున్నతమైన 'రాష్ట్రపతి పోలీసు పతకం' (పీపీఎంజీ) ప్రకటించారు. మంగళవారం జరగనున్న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సైనిక, పోలీసు అధికారులకు వివిధ పతకాలను సోమవారం ప్రకటించారు.
కేంద్ర హోంశాఖ వెల్లడించిన జాబితా ప్రకారం 207 మంది పోలీసులకు సాహస పురస్కారాలు, 89 మందికి రాష్ట్రపతి పోలీసు పతకాలు (పీపీఎం), 650 మంది పోలీసులకు విశిష్ట సేవా పతకాలు లభించనున్నాయి. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో పేలుడు పదార్థాలు నింపిన కారుతో సీఆర్‌పీఎఫ్ వాహనశ్రేణిలో చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను అక్కడి పికెట్ కమాండర్ మోహన్‌లాల్ గుర్తించి, అందరినీ అప్రమత్తం చేశారు. కారును ఆపాలని ప్రయత్నించి, దానిని వెంబడించారు. ఆత్మాహుతి దళం ఉన్న కారు వేగాన్ని అందుకోలేక దానిపై కాల్పులు జరిపారు. ఆ కారు సీఆర్‌పీఎఫ్ బస్సును ఢీకొట్టి, భారీ పేలుడు సృష్టించింది. దానిలో లాల్, మరో 39 మంది సిబ్బంది అమరులయ్యారు. ఉగ్రవాదులను నిలువరించే క్రమంలో చూపిన సాహసానికి గానూ ఆయనకు పీపీఎంజీని ప్రకటించారు.
మావోయిస్టులను, ఉగ్రవాదులను ఎదుర్కొనే కార్యకలాపాల్లో పాల్గొంటున్న సీఆర్‌పీఎఫ్ బలగాలకు దీంతో కలిపి ఈ ఏడాది 69 పతకాలు లభించాయి. జమ్మూకశ్మీర్ పోలీసులకు 52, సరిహద్దు భద్రత దళానికి 20, దిల్లీ పోలీసులకు 17, మహారాష్ట్ర పోలీసులకు 13 చొప్పున పతకాలు అందనున్నాయి. ఐటీబీపీలో మొత్తం 17 మందికి పతకాలు ప్రకటించారు.