పుదుచ్చేరి శాసనసభలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఓ సభ్యుడికి కరోనా పాజిటివ్ అని తేలిన కారణంగా అసెంబ్లీ సమావేశాలను తొలిసారిగా చెట్టు కింద నిర్వహించారు.
పుదుచ్చేరి శాసనసభ సమావేశాలు ఈ నెల 20న ప్రారంభం అయ్యాయి. అయితే సభకు హాజరైన విపక్ష సభ్యుడు ఎన్ఎస్జే జయబాల్ కరోనా సోకి శుక్రవారం ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో శాసనసభ ప్రధాన భవనాన్ని శానిటైజేషన్ కోసం మూసివేశారు. శనివారం సమావేశాలకు చివరి రోజు. ప్రధాన భవనం అందుబాటులో లేని కారణంగా సభ ప్రాంగణంలోని తోటలో ఉన్న వేప చెట్టు కింద సమావేశాలను నిర్వహించారు. సభాపతి సహా సభ్యులు అందరికీ అక్కడే కుర్చీలు వేసి సభ నిర్వహించారు. సమావేశాల్లో బడ్జెటరీ కేటాయింపులకు ఆమోదం తెలిపి సభను నిరవధికంగా వాయిదా వేశారు. అనంతరం సభ్యులు ఏడు రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాలని నిర్ణయించారు. వీరందరికీ జులై 27న కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.