తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడులో అదృష్టం ఉంటేనే నీళ్లు!

తమిళనాడులో నీటి కొరత కొత్త ఇబ్బందుల్ని సృష్టిస్తోంది. ఇప్పటికే ఎన్నో ఇక్కట్లు ఎదుర్కొంటున్న తమిళ ప్రజలు తాగునీటి కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. కుళాయి నీళ్ల కోసం గొడవలూ జరుగుతున్నాయి. అయితే.. కరుంకుళం గ్రామస్థులు నీటి కొరతను అధిగమించేందుకు కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. లాటరీ విధానం ద్వారా నీరు ఏ సమయంలో ఎవరు పట్టుకోవాలో నిర్ణయిస్తున్నారు.

By

Published : Jun 21, 2019, 4:56 PM IST

Updated : Jun 21, 2019, 8:33 PM IST

తమిళనాడులో అదృష్టం కొద్ది నీళ్లు!

తమిళనాడులో మరింత తీవ్రమైన నీటి సంక్షోభం

తమిళనాడులో నీటి సంక్షోభం గత కొద్ది రోజులుగా తీవ్ర స్థాయికి చేరింది. తాగేందుకు నీరు లేక ఎన్నో ఇబ్బందులెదుర్కొంటున్నారు రాష్ట్ర ప్రజలు. ఎప్పుడొస్తాయో తెలియని కుళాయి నీళ్ల కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. గొడవలూ జరుగుతున్నాయి.

అయితే.. నీటి కొరతను అధిగమించేందుకు రామంతపురం జిల్లా కరుంకుళం గ్రామస్థులు కొత్త పద్ధతిని అవలంబిస్తున్నారు. నీటిని అందరూ పొదుపుగా వాడుకునేందుకు లాటరీ విధానాన్ని ఎంచుకున్నారు.

చీటీల విధానం..

కరుంకుళంలో దాదాపు 100 కుటుంబాలు ఉంటాయి. ఈ వంద కుటుంబాల నుంచి పేర్లు కాగితంలో రాసి ఒక డబ్బాలో వేస్తారు. లాటరీ విధానం ద్వారా నీరు ఎవరు ముందు పట్టుకోవాలో నిర్ణయిస్తారు. చీటీల్లో పేర్లు వచ్చిన వారు వరుస క్రమంలో నీరు పట్టుకోవాల్సి ఉంటుంది.

ఒకవేళ.. ఆ సమయానికి నీరు నిలిచిపోతే మళ్లీ కుళాయి వదిలేవరకు ఎదురుచూడాల్సిందే. మిగతా చీటీలను మరొక డబ్బాలో ఉంచుతారు. వీరూ.. తిరిగి లాటరీ పద్ధతిలోనే నీరు పట్టుకోవాలి. అయితే.. ఈ లాటరీ విధానంతో నీరు అందరికీ దొరుకుతోందని అంటున్నారు స్థానికులు.

రుతుపవనాల ఆలస్యంతో వర్షాలు లేక తమిళనాడులో నీటి సంక్షోభం తలెత్తింది. నీటిని పొదుపు చేసేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు రాష్ట్ర ప్రజలు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వమూ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది.

శౌచాలయాల్లో నీరు లేక.. ఉద్యోగుల్ని ఇంటి నుంచే పని చేయాలని ఇటీవల ఐటీ సంస్థలు కోరాయి. హోటళ్లు, అతిథి గృహాలు తాత్కాలికంగా మూసివేస్తున్నారు. క్యాంటీన్లలో భోజనానికీ నీటి కొరత సెగ తగిలింది. తాగునీటి కోసం అనేక ప్రాంతాల్లో జనం మండుటెండల్లో సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు.

Last Updated : Jun 21, 2019, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details