తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రజాకర్షక పథకాల 'పవర్‌'.. ఆప్​ వ్యూహమిదే - Aam Aadmi Party (AAP) to win in 2020 assembly elections

దేశ రాజధాని దిల్లీలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి, ప్రత్యర్థులను మట్టి కరిపించటానికి ఆమ్​ ఆద్మి పాటించిన వ్యూహం ఏమిటి? ఇతర పక్షాలను ఎన్నికల్లో ఎలా చిత్తుచేసింది? వీటిపై ఓ సారి లుక్కేద్దాం.

delhi
ప్రజాకర్షక పథకాల పవర్‌

By

Published : Feb 12, 2020, 12:50 PM IST

Updated : Mar 1, 2020, 2:05 AM IST

దేశ రాజధానిలో సగటు ఓటర్లకు ఏం కావాలి, ఎలాంటి పథకాలతో వారిని ఆకట్టుకోవచ్చు అనేవి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) గుర్తించగలిగింది. తదనుగుణంగా రూపొందించిన ప్రణాళిక... భారీగానే ఓట్లను రాబట్టగలిగింది. గెలిచిన, ఓడిన పార్టీలన్నీ ఇప్పుడు ప్రజాకర్షక పథకాల స్థాయిని పెంచుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని వర్గాలపై ఉచిత వరాలు కురిపించేందుకు ప్రజలందరి డబ్బును ఖర్చు చేయడమేమిటని దేశంలోని మిగతా చోట్ల నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నా... ఆప్‌ మాత్రం దీనిని సమర్థించుకుంటోంది. అందరికీ ఆహారం, వస్త్రాలు, ఆవాసం ఉండాలనే ఉద్దేశంతో కొన్ని దశాబ్దాల క్రితం కాంగ్రెస్‌ ఇచ్చిన నినాదం ‘'రోటీ, కపడా, ఔర్‌ మకాన్‌'’కు అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ దానికి అదనంగా విద్యుత్తు, రహదారులు, తాగునీరు (బిజిలీ, సడక్‌, పానీ) అని చేర్చింది.

వాగ్దానాలు చేసి... ఆచరణలో చూపి...

2015 అసెంబ్లీ ఎన్నికల సమయంలో దిల్లీ ప్రజల ఆర్థిక స్థితిగతులపై ఆప్‌ విస్తృతంగా ఒక సర్వే నిర్వహించింది. దిల్లీ జనాభాలో 10 శాతంతో సమానమైన 17 లక్షల మంది మురికివాడ వాసుల నెలవారీ ఆదాయం రూ.10,000 కంటే తక్కువేనని దానిలో బయటపడింది. 20% ప్రజల ఆదాయం రూ.10,000 నుంచి రూ.30,000 మధ్య ఉంది. దీంతో తాగునీటి బిల్లు సగానికి తగ్గిస్తామని, ఉచిత విద్యుత్తు అందిస్తామని, మహిళా ప్రయాణికులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆ ఎన్నికల్లో ఆప్‌ హామీ ఇచ్చింది. తద్వారా 70లో 67 సీట్లు గెలుచుకుంది. ఆ హామీలను పార్టీ నిలబెట్టుకుంది.

  • ప్రతి 12 వేల మందికి ఒక్కొక్కటి చొప్పున అందుబాటులో ఉండేలా ప్రవేశ పెట్టిన 400 ముహల్లా క్లినిక్కులు భారీగా విజయవంతమయ్యాయి.
  • మహిళలకు దిల్లీ సురక్షితం కాదనే విమర్శల్ని తిప్పికొట్టేందుకు భద్రత బలగాలను దిల్లీ రవాణా సంస్థ బస్సుల్లో అందుబాటులో ఉంచింది. దీంతో మహిళలకు భద్రత పెరిగింది. ఉచిత రవాణా సౌకర్యంతోనూ మహిళలు నెలకు రూ.1200-1800 మధ్య ఆదా చేయగలుగుతున్నారు.
  • తాగునీటి బిల్లుల్ని సగానికి తగ్గించడం, 200 యూనిట్లలోపు వినియోగం ఉన్నవారికి విద్యుత్తును ఉచితంగా అందించడం వంటివి పేదల్ని, మధ్య తరగతి వర్గాలను ఆమ్‌ ఆద్మీ పార్టీకి మరింత చేరువ చేశాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా పక్షాన నిలిచిన ఈ రెండు వర్గాలు ఈసారి ఆప్‌ను ఎన్నుకున్నాయి. ఈ రెండు వర్గాల ఓటర్లే 50% పైగా ఉన్నారు.

ఈసారి మరింతగా...

గత ఎన్నికల అనుభవంతో ఆప్‌ ఈసారి ఇంకాస్త ముందడుగు వేసింది. మహిళలందరికీ ప్రజా రవాణాలో ప్రయాణాలు ఉచితమని ప్రకటించింది. దాంతో పేద, అల్పాదాయ వర్గాలు ఈ పార్టీకి అండగా నిలిచాయి. రాజకీయంగా ఇది లాభదాయకంగా ఉన్నా నిజమైన పన్ను చెల్లింపుదారులపై భారాన్ని మోపుతోందనేది వాస్తవం.

పేదల్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు ఉచితాలు సముచితమేనని, ఏడు దశాబ్దాలపాటు కొనసాగిన అస్తవ్యస్త ప్రగతిని సరిచేయడానికి ఇవి అవసరమని ఆప్‌ నేతలు గట్టిగా సమర్థించుకుంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే భాజపా, కాంగ్రెస్‌లు ఈ ఉచిత హామీలపై ఒక్కసారైనా ప్రశ్నలు లేవనెత్తకపోవడం. పైపెచ్చు తమకు అవకాశం కల్పిస్తే ఉచితంగా అనేకం ఇస్తామంటూ పోటాపోటీగా హామీలిచ్చాయి. గోధుమ పిండిని కిలో రూ.2 చొప్పున పేదలకు ఇస్తామని భాజపా వాగ్దానం చేసింది. ఉచిత విద్యుత్తు, నిరుద్యోగులకు నెలావారీ భృతి వంటివి కాంగ్రెస్‌ ప్రకటించింది. అయినా హస్తిన ఓటర్లు మాత్రం చీపురు గుర్తుకే జైకొట్టారు.

ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న బలహీనతలనూ ఆప్‌ అనుకూలంగా మలచుకుంది. సీఎంగా కేజ్రీవాల్‌కు సమానమైన ప్రత్యర్థి ఎవరంటూ ప్రశ్నిస్తూ ఈ ఎన్నికల తీరునే మార్చేసింది.

ఇదీ చూడండి:జీరో ఎఫెక్ట్​: దిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీనామా

Last Updated : Mar 1, 2020, 2:05 AM IST

ABOUT THE AUTHOR

...view details