ఉత్తరప్రదేశ్‌లోని ఓ సైకో.. సొంత అన్ననే చంపడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే ఇద్దరిని చంపినట్టు, మరో ముగ్గురిని హత్యచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు ఆ ఉన్మాది. ఇలా హత్యలు చేయడమంటే తనకు ఎంతో ఇష్టమని ఆ సైకో చెప్పడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.
'చంపడమంటే ఇష్టం...'
ఎటా జిల్లాలోని ధర్మపుర్ గ్రామవాసి రాధేశ్యామ్. ఇంటర్ పూర్తి చేసుకున్న అతను ఇదివరకే తన బంధువుల పిల్లలైన ఆరేళ్ల సత్యేంద్ర, ఐదేళ్ల ప్రశాంత్‌ను హతమార్చాడు.
జూన్ 11వ తేదీన సొంత అన్ననే హత్యచేయడానికి సిద్ధపడ్డాడు శ్యామ్. అన్న విశ్వనాథ్ సింగ్ నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో చంపాలని తన గదిలోకి వెళ్లాడు. అదే సమయానికి కుటుంబసభ్యులు రాధేశ్యామ్‌ను పట్టుకున్నారు. విశ్వనాథ్ త్రుటిలో ప్రాణాలు కాపాడుకున్నాడు. చివరికి శ్యామ్‌ను పోలీసులకు అప్పగించారు.