కరోనా మహమ్మారి సమయంలో ఆన్లైన్ విద్యపై కీలక వ్యాఖ్యలు చేసింది దిల్లీ హైకోర్టు. ఆన్లైన్ విద్య అనేది విద్యాహక్కు చట్టం(ఆర్టీఈ) పరిధిలోనిదేనని.. అందులో భాగంగానే తమ బాధ్యతగా ఆన్లైన్ బోధనను ప్రైవేటు పాఠశాలలు అందిస్తున్నాయి తప్ప.. సామాజిక సేవగానో లేదా స్వచ్ఛందంగానో అందించటం లేదని స్పష్టం చేసింది.
కరోనా మహమ్మారి కారణంగా భౌతిక తరగతులు రద్దయినప్పటికీ.. ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న క్రమంలోనే ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తున్నట్లు పేర్కొంది జస్టిస్ మన్మోహన్, జస్టిస్ సంజీవ్ నరులాలతో కూడిన ధర్మాసనం. ట్యూషన్ ఫీజు అనేది విద్య అందించేందుకు చెల్లించాలి కానీ, సీటు కోసం కాదని స్పష్టం చేసింది.
కరోనా లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ క్లాసులు వినేందుకు విద్యార్థులకు సెల్ఫోన్, ట్యాబ్లెట్, లేదా ల్యాప్టాప్లను ఉచితంగా అందించేలా కేంద్రం, దిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ.. 'జస్టీస్ ఫర్ ఆల్' అనే స్వచ్ఛంద సంస్థ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ పిల్ విచారణ సందర్బంగా ఈ మేరకు వ్యాఖ్యానించింది ధర్మాసనం.