బ్యాంకుల నుంచి రూ.వేలకోట్ల రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుండా ఉన్న బడా రుణ గ్రహీతల పేర్లు అందజేయాలని రిజర్వు బ్యాంకును ఆదేశించింది కేంద్ర సమాచార కమిషన్. రుణ ఎగవేతదారులుగా తీర్మానించాలని గతంలో కొందరి పేర్లతో కూడిన జాబితాను బ్యాంకులకు పంపింది ఆర్బీఐ. ఆ జాబితాలోని పెద్ద మొత్తంలో రుణాలు పొందిన వారి వివరాలు ఇవ్వాలని సీఐసీ పేర్కొంది.
లఖ్‌నవూకు చెందిన సామాజిక కార్యకర్త నతున్ ఠాకూర్ ఫిర్యాదుపై విచారణ చేపట్టింది సీఐసీ.
2017లో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య.. రుణ ఎగవేతదారుల జాబితాను బ్యాంకులకు పంపించినట్లు పేర్కొన్న విషయంపై ఆర్టీఐ కింద దరఖాస్తు చేశారు ఠాకూర్. మీడియా సమావేశంలో ఆచార్య పేర్కొన్న జాబితాలోని రుణ ఎగవేతదారుల వివరాలు, నోట్ షీట్స్, వారి ఖాతాల వివరాలు ఇవ్వాలని ఆర్బీఐను కోరారు. కానీ ఆర్బీఐ ఆమె దరఖాస్తును తిరస్కరించింది. అది గోప్యంగా ఉంచాల్సిన సమాచారమంటూ పేర్కొంది.