పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసిన భారత సైన్యాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశంసించింది. సాయుధ దళాల పరాక్రమాన్ని చూసి గర్వంగా ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ట్వీట్ చేశారు. దేశ సరిహద్దులను సురక్షితంగా కాపాడుతున్న సాయుధ దళాలపై పూర్తి విశ్వాసం ఉందని హరియాణా కాంగ్రెస్ చీఫ్ కుమారి సెల్జా అన్నారు.
భారత సైన్యాన్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది : కాంగ్రెస్ - Army attack at loc
జమ్ముకశ్మీర్ సరిహద్దులోని ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసిన భారత సైన్యం ధీరత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశంసించారు. శతఘ్నులతో దాడులు చేసి.. తీవ్రవాద శిబిరాలపై విరుచుకుపడిన.. సైనికుల శౌర్యం, ధైర్యాన్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని కొనియాడారు.
" సరిహద్దు వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసే దిశగా భారత సైన్యం మరో అద్భుత చర్య తీసుకుంది. మీ శౌర్యం, ధైర్యాన్ని చూస్తుంటే మాకెంతో గర్వంగా ఉంది."
- అభిషేక్ సింఘ్వి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌లోకి పెద్ద ఎత్తున ఉగ్రవాదులను పంపి పాకిస్థాన్ విధ్వంసానికి యత్నిస్తోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్న వేళ...దాయాది దేశం చేసిన అలాంటి ప్రయత్నాన్ని భారత సైన్యం వమ్ము చేసింది. పాక్ సైనిక కేంద్రాలు, ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం శతఘ్నులతో దాడులు చేసింది. ఈ ఘటనలో 6-10 మంది పాక్ సైనికులు మరణించినట్లు భారత సైన్యాధిపతి బిపిన్ రావత్ తెలిపారు.