పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ప్రభుత్వం భరోసా ఇచ్చినప్పటికీ.. ఈ ఆందోళనలు తగ్గకపోవడమే ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. దిల్లీలోని కడ్కడ్డుమాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ.. నిజమైన కుట్ర నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కొందరు రాజ్యాంగం- త్రివర్ణ జెండాను అడ్డం పెట్టుకుంటున్నారని విమర్శించారు.
"సీలంపుర్, జామియా, షహీన్‌బాగ్... గత కొన్ని రోజులుగా పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనలు అకస్మాత్తుగా జరిగినవా? కాదు.. ఇవి యాదృచ్ఛికం కాదు.. ఇవి విపక్షాల ప్రయోగాలు. దీని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉంది. దేశ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే వారి నైజం. వీరు చట్టవ్యతిరేకులు కాకపోయుంటే.. ప్రభుత్వం భరోసా ఇచ్చినప్పుడే ఈ నిరసనలు ఆగిపోయుండాల్సింది. కానీ ఆమ్ ఆద్మీ-కాంగ్రెస్ రాజకీయ కుట్రకు పాల్పడుతున్నాయి."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.