పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా పశ్చిమ బంగాలో చెలరేగిన నిరసనలు వరుసగా మూడోరోజు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు రోడ్లపైకి చేరి నిరసనలు చేపట్టారు. నదియా, బిర్భుమ్, ఉత్తర 24 పరగణాలు, హౌరా జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఉత్తర 24 పరగణాల జిల్లాలోని అమదంగా, కల్యాణి ప్రాంతాల్లో ఆందోళనకారులు రోడ్లపై టైర్లు, దుంగలు కాల్చి.. రవాణాకు అంతరాయం కలిగించారు. వ్యాపార సముదాయాలను మూసివేశారు. నదియాలో కల్యాణి ఎక్స్ప్రెస్ హైవేను నిర్భందించారు.
బలగాల మోహరింపు..
ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో బలగాలను తరలించారు అధికారులు. నిరసనకారులను చెదరగొట్టేందుకు చర్యలు చేపట్టారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని రైల్వే స్టేషనల్లో భద్రత పెంచింది రైల్వే శాఖ. ఆర్పీఎఫ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నారు.