'పౌర' సెగపై విచారణకు సుప్రీం నో- హైకోర్టులకు వెళ్లాలని సూచన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో హింసపై విచారణ కోసం కమిటీ ఏర్పాటు చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై దాఖలైన పిటిషన్లను సుప్రీం పరిశీలించింది. ఈ ఘటనలపై ఆయా రాష్ట్రాల హైకోర్టులను ఆశ్రయించాలని సూచించింది. విచారణ కమిటీలను ఆయా కోర్టులే ఏర్పాటు చేస్తాయని వ్యాఖ్యానించింది.
ముఖ్యంగా పిటిషనర్లు రెండు వాదనలు లేవనెత్తినట్లు ధర్మాసనం పేర్కొంది. విద్యార్థులపై పోలీసులు అన్యాయంగా లాఠీఛార్జి చేసి అరెస్ట్ చేశారని... గాయపడిన వారికి సరైన వైద్యం అందించలేదని పిటిషనర్లు ఆరోపించినట్లు ధర్మాసనం వెల్లడించింది. ఈ ఆరోపణలను కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఖండించారు.
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు విద్యార్థులు మాత్రమే గాయపడినట్లు... వారికి వర్శిటీ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నట్లు మెహతా కోర్టుకు తెలిపారు. ఆ విద్యార్థులు పోలీసుల దాడిలో గాయపడలేదని తెలిపారు.
వాద ప్రతివాదనలు విన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం... కీలక వ్యాఖ్యలు చేసింది.
"ఈ పరిణామాల్ని పరిశీలించిన అనంతరం.. ఘటనలు జరిగిన రాష్ట్రాల్లో నిజానిజాలు తెలుసుకునేందుకు ఆయా రాష్ట్రాల్లో ఒక్కొక్క కమిటీని ఏర్పాటు చేయాలని మేము భావిస్తున్నాం. పిటిషనర్లు ఘటన జరిగిన ఆయా రాష్ట్రాల్లోని హైకోర్టులను సంప్రదించాలి. వివిధ హైకోర్టుల్లోని ప్రధాన న్యాయమూర్తులు ఈ ఘటనలపై సమగ్రంగా విచారణ జరుపుతారని మాకు విశ్వాసం ఉంది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఘటనలో అన్ని కోణాలనూ పరిశీలించి.. హైకోర్టులు సరైన విచారణ కమిటీలను ఏర్పాటు చేస్తాయని మేము నమ్ముతున్నాం."
- సుప్రీం ధర్మాసనం
విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేసే ముందు ఆయా విశ్వవిద్యాలయాల ఉపకులపతులను సంప్రదించలేదనే తీవ్రమైన అంశాన్ని పిటిషనర్లు లేవనెత్తినట్లు సుప్రీం వ్యాఖ్యానించింది. ఈ అంశాన్ని సొలిసిటర్ జనరల్ ఖండించారు. ఈ ఘటనల్లో ఏ ఒక్క విద్యార్థిని అరెస్ట్ చేయలేదని మెహతా స్పష్టం చేశారు.