కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయచట్టాల రద్దును కోరుతూ.. ఆందోళన చేపడుతున్న రైతులు దేశవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. కొత్తసాగు చట్టాలను రద్దు చేయకుంటే జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీ సరిహద్దుల్లో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. గణతంత్ర వేడుకలకు అతిథిగా రానున్న క్రమంలో రైతులు ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం.
దిల్లీలో జనవరి 26న రైతుల ట్రాక్టర్ ర్యాలీ - రైతుల నిరసనలు వ్యవసాయ చట్టాలు
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయకుంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీ సరిహద్దుల్లో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని పరిష్కరించాల్సింది కార్యనిర్వహక వర్గమే కానీ న్యాయవ్యవస్థ కాదని పేర్కొన్నాయి.
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని పరిష్కరించాల్సింది కార్యనిర్వహక వర్గమే కానీ న్యాయవ్యవస్థ కాదని అఖిల భారత కిసాన్ సభ(ఏఐకేఎస్) నేతలు అన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని పేర్కొన్నారు.
సాగు చట్టాల రద్దును కోరుతూ ఈ నెల 22న నాసిక్‌లో రైతుల ర్యాలీ ప్రారంభమవుతుందని మహారాష్ట్రకు చెందిన ఏఐకేఎస్ నేతలు ప్రకటించారు. మరోవైపు సుప్రీంకోర్టులో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు శివకుమార్ కక్కా నేతృత్వంలోని రైతు నేతల బృందం.. ప్రశాంత్ భూషణ్ తదితర న్యాయవాదులతో భేటీ అయ్యింది.