ఈనెల 6న దేశవ్యాప్త నిరసనలకు రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం మధ్యాహ్నం మూడు గంటల పాటు జాతీయ రహదారుల దిగ్బంధించాలని సంయుక్త కిసాన్ మోర్చా విజ్ఞప్తి చేసింది. చక్కా జామ్ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రైతు సంఘాలు సోమవారం ప్రకటించాయి.
6వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి 3గంటల వరకు జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధించాలని నేతలు నిర్ణయించారు.
బడ్జెట్ గురించి తెలియదు..!
బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఎంత కేటాయించారన్నది తమకు ముఖ్యం కాదని, కొత్త సాగు చట్టాల రద్దే లక్ష్యమని రైతులు స్పష్టం చేశారు. ఇంటర్నెట్ సేవల నిలిపివేతతో తమకు బడ్జెట్ విశేషాలేమీ తెలియవని నిరసనకారులు తెలిపారు.
ఇదీ చూడండి:పద్దు 2021: 'రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం'
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతు సంఘాల నేతలు రెండు నెలలకు పైగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తున్నారు.
హోం మంత్రిని కలిసిన కాంగ్రెస్ నాయకులు..
ట్రాక్టర్ల కవాతు అనంతరం కనిపించకుండా పోయిన యువ రైతుల ఆచూకీ కనుక్కోవాలంటూ కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ, పంజాబ్‌కు చెందిన మంత్రులు సోమవారం.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కలిసి విజ్ఞప్తి చేశారు. అరెస్టైన వ్యక్తుల వివరాలను ఇప్పటికే హోం శాఖ వెబ్సైట్లో పెట్టామని, ఇంకా ఎవరైనా కనిపించకపోయుంటే ఆ జాబితాను అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని షా హామీ ఇచ్చినట్లు పంజాబ్ మంత్రి సుఖ్జిందర్ రంధావా తెలిపారు.
ఇంటర్నెట్ నిషేధం పొడిగింపు..
సింఘు, గాజీపూర్, టిక్రీ సరిహద్దుల్లో నెలకొన్న ఘర్షణ వాతావరణం దృష్ట్యా కేంద్ర హోంశాఖ ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది. తాజాగా ఈ నిషేధాన్ని మరో రెండు రోజుల పాటు పొడిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: రైతులను ఆపేందుకు దిల్లీ సరిహద్దులో మేకులు