'చర్చకు సై.. కానీ షరతులు వర్తిస్తాయ్' బంగాల్లో 6 రోజులుగా ఆందోళనలు చేపడుతున్న వైద్య విద్యార్థులు కాస్త మెత్తబడ్డారు. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని, వేదిక ఎక్కడో ముఖ్యమంత్రి మమత బెనర్జీ నిర్ణయించాలని ప్రకటించారు. అయితే... ఈ చర్చలు బహిరంగంగానే జరగాలని తేల్చిచెప్పారు.
వైద్య విద్యార్థుల ప్రతినిధులు మాత్రమే తమతో చర్చలకు రావాలని శనివారం ఆహ్వానించారు మమత. అందుకు జూనియర్ డాక్టర్లు నిరాకరించారు.
"ప్రస్తుత ప్రతిష్టంభనకు తెరదించాలని చూస్తున్నాం. ముఖ్యమంత్రి ఎంపిక చేసిన వేదికపై చర్చలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రహస్యంగా కాకుండా మీడియా సమక్షంలో బహిరంగ చర్చ జరపాలి. చర్చల ద్వారా మా డిమాండ్లు పరిష్కారమైన వెంటనే సామాన్య ప్రజల ప్రయోజనాల దృష్ట్యా విధుల్లో చేరాలని అనుకుంటున్నాం. మా సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాం."
- జూడాల ప్రతినిధి
రాష్ట్రంలోని వైద్య కళాళాలలు, ఆసుపత్రులకు చెందిన ప్రతినిధులు కూర్చోవడానికి వేదిక విశాలంగా ఉండాలని సూచించారు వైద్య విద్యార్థులు. చర్చలు సఫలమయ్యే వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టంచేశారు.
ఇదీ చూడండి: చర్చలకు మేం సిద్ధం: బెంగాల్ జూడాలు