పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తోన్న వారిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్న కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కర్ణాటకలోని సిద్ధగంగ మఠం పీఠాధిపతి శివకుమార స్వామి స్మారకార్థం ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను మోదీ ప్రారంభించారు. అనంతరం సభలో ప్రసంగిస్తూ.. పాకిస్థాన్‌లో వివక్షకు గురవుతున్న మైనారిటీలకు విముక్తి కల్పించేందుకే పౌర చట్టాన్ని సవరించినట్లు స్పష్టం చేశారు. హస్తం పార్టీ అందుకు వ్యతిరేకంగా గళం విప్పడం సరికాదన్నారు.
'పౌరచట్టంపై కాదు.. పాక్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేయండి' - 'సీఏఏపై కాదు.. పాక్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేయండి'
సీఏఏకు బదులుగా పాకిస్థాన్‌లో మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు పాక్‌పై ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు.
పాకిస్థాన్ మత ప్రాతిపదికన ఏర్పడిన దేశమన్న ప్రధాని.. అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులు, సిక్కులు, జైనులు, క్రిస్టియన్లపై దురాగతాలు పెరిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారందరినీ కాపాడాల్సిన బాధ్యత మనదేనని స్పష్టం చేశారు. సీఏఏపై నిరసనలు, ర్యాలీలు చేస్తున్నవారు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ప్రశ్నించారు.
" గత కొన్ని వారాల క్రితం దేశ ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు.. పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపే చారిత్రక కార్యాన్ని పూర్తి చేసింది. కానీ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పార్లమెంటుకు వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభించాయి. దేశ విభజన నాటి నుంచే పాకిస్థాన్‌లో ఇతర మతాలవారిపై అకృత్యాలు ప్రారంభమయ్యాయి. కానీ, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మాట్లాడదు. పాక్ చేస్తోన్న దురాగతాల గురించి మాట్లాడడానికి వారికి తీరిక లేదు. ఈ విషయంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాల నోళ్లకు తాళం పడడానికి కారణమేంటి?"
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి